EX MP VIJAYASAI REDDY PRESS MEET: మద్యం అమ్మకాల విషయంలో ఎప్పుడూ తాను జోక్యం చేసుకోలేదని, అన్ని ప్రశ్నలకూ రాజ్ కసిరెడ్డే సరైన జవాబులు చెబుతాడని విజయసాయి రెడ్డి అన్నారు. మద్యం కేసులో విజయవాడ సిట్ కార్యాలయంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణ ముగిసింది. విజయసాయిరెడ్డిని దాదాపు 3 గంటలపాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నా స్థానం నెంబర్-2 నుంచి 2000కు పడిపోయింది: సిట్ అధికారులు తనను 4 ప్రశ్నలు అడిగారని, తన జవాబులతో సంతృప్తి చెందారని భావిస్తున్నానన్నారు. మరోసారి పిలిచినా వస్తానని సిట్ అధికారులకు చెప్పానని, రాజ్ కసిరెడ్డిని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి తెలివైన క్రిమినల్ అని అన్నారు. ఇక ప్రాంతీయ పార్టీల్లో నెంబర్-2 అనేది ఉండదని, కోటరీ తనపై లేనిపోనివి చెప్పి జగన్ మనసు మార్చిందని మరోసారి చెప్పారు. కోటరీ వేధింపులు తాళలేక అనేక ఇబ్బందులు పడ్డానన్న విజయసాయి రెడ్డి, తన స్థానం నెంబర్-2 నుంచి 2000కు పడిపోయిందని వ్యాఖ్యానించారు.
కిక్‌బ్యాగ్స్ గురించి నాకు తెలియదు: రెండు సమావేశాల్లో ఏం చర్చించారు, ఎవరెవరు పాల్గొన్నారని సిట్ అధికారులు అడిగినట్లు తెలిపారు. మొదటి సమావేశం హైదరాబాద్‌లో జరిగిందని, రెండో సమావేశంలో లిక్కర్ పాలసీపై చర్చించారని చెప్పానన్నారు. కిక్‌బ్యాగ్స్ గురించి అడిగారని, తనకు తెలియదని చెప్పానని అన్నారు. రాజ్ కసిరెడ్డి వసూలు చేసినవి ఎవరికి వెళ్లాయో తనకు తెలియదని పేర్కొన్నారు.
బిగ్‌బాస్ ఎవరో రాజ్ కసిరెడ్డిని అడగాలి: ఎవరికైనా సిఫారసు చేశారా అని అడిగారని తెలిపారు. రెండు కంపెనీలకు సిఫారసు చేశానని, ఒకరికి రూ.60 కోట్లు, మరొకరికి రూ.40 కోట్లు ఇచ్చారని విజయసాయి రెడ్డి చెప్పారు. తాను రుణం మాత్రమే ఇప్పించానని, నిధుల వినియోగం గురించి తెలీదని చెప్పారు. వ్యవసాయం చేసుకుంటానన్న వ్యక్తికి రాజకీయాలు ఎందుకని అంటున్నారని అన్నారు. ఎంపీ కావాలని తాను ఎప్పుడూ, ఎవరినీ అడగలేదన్నారు. మద్యం స్కామ్‌లో బిగ్‌బాస్ ఎవరో రాజ్ కసిరెడ్డిని అడగాలని విజయసాయిరెడ్డి చెప్పారు.
ఏపీ లిక్కర్ స్కామ్ - దూకుడు పెంచిన సిట్ - విచారణకు విజయసాయిరెడ్డి
మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక పరిణామం - ఆ ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు!