Ex DGP HJ Dora Interview Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు మృతి మావోలకు కోలుకోలేని ఎదురుదెబ్బ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్రాంత డీజీపీ హెచ్.జె దొర అన్నారు. దేశంలో మావోయిస్టు పార్టీకి ఎలాంటి భవిష్యత్ లేదని హెచ్.జె.దొర అన్నారు. ఛత్తీస్‌గఢ్ సర్కారు, కేంద్రం పక్కాగా ఆపరేషన్ చేపడుతోందని హెచ్‌జే దొర అన్నారు. ప్రజల నుంచి మావోయిస్టులకు మద్ధతు లేదన్నారు. ఏళ్లనాటి సిద్ధాంతాలతో ఆయుధాలు పట్టడం సరికాదన్నారు. మావోయిస్టులు లేకపోవడం వల్లే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దెబ్బలు తగిలినప్పుడే మావోయిస్టులు చర్చలను తెరపైకి తెస్తారన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎదుర్కొన్న తీరుపై హెచ్.జె.దొరతో ముఖాముఖి
ఇవాళ ఎన్కౌంటర్లో మృతి చెందిన నంబాళ్ల కేశవరావు ఆర్ఈసీ వరంగల్‌లో ఉన్నప్పుడే దళంవైపు ఆకర్షితుడయ్యాడన్నారు. అప్పుడు జరిగిన ఓ ఘటన అనంతరం అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడని తెలిపారు. మావోయిస్టు అగ్రనాయకత్వ బాధ్యతలు చేపట్టాక నంబాళ్ల కేశవరావు పలు మార్పులను తెచ్చాడని హెచ్.జె.దొర అన్నారు. ముఖ్యంగా యుద్ధతంత్రాలు, అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవడం లాంటివాటిపై దృష్టి పెట్టేవాడని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు మావోయిస్టులు తీవ్రనష్టం కలిగించారని హెచ్.జె.దొర అన్నారు. మావోయిస్టుల చర్యల వల్ల అప్పట్లో పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తాను డీజీపీగా పని చేస్తున్నప్పుడే మావోయిస్టులు సరెండర్ అయ్యే ప్రక్రియను తీసుకువచ్చామని, ఆ రోజుల్లోనే చాలా మంది దళం నుంచి బయటకు వచ్చారని తెలిపారు. ఇప్పటికైనా హింసను వీడి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. తాజా ఎన్‌కౌంటర్‌తో పాటు, ఆపరేషన్ కగార్ తదితర విషయాలపై ఆయన మాట్లాడారు.
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయని డీజీపీ దొర అన్నారు. సామాజిక న్యాయం కోసం ఇటీవలి ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తారనే నమ్మకం తనకుందని అన్నారు. భవిష్యత్‌లో యువత కూడా అటువైపు వెళ్లరని భావిస్తున్నానని తెలిపారు. ఒకప్పుడు తెలంగాణలో శాంతిభద్రతలకు ప్రస్తుత పరిస్థితులకు చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చాలా స్థిరంగా ఉందని హెచ్.జె.దొర అభిప్రాయపడ్డారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ శాంతి ఉండాలనే ఒక స్పష్టమైన లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. వరుస ఎన్కౌంటర్లతో ఇప్పటికే మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని ఆయన తెలిపారు.
మావోయిస్టు ఆగ్రనేత ఎన్ కౌంటర్ - ఇంతకీ ఎవరీ నంబాల కేశవరావు?
చంద్రబాబుపై అటాక్- కాంగ్రెస్ నాయకత్వంపై మెరుపు దాడి- మిలటరీ ఆపరేషన్స్ మాస్టర్ మైండ్ 'నంబాల'