Engineering Students Excelling in Sports and Won Medals: చదువుతో పాటు ఆటల్లోనూ ఇంజినీరింగ్ విద్యార్థులు రాణిస్తూ పతకాలను సాధిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాణించాలన్న లక్ష్యంతో సాధన చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతూ క్రీడా నైపుణ్యాలతో జేఎన్‌టీయూ 'ఏ' విశ్వవిద్యాలయ స్థాయి జట్టులో స్థానం పొందడమే కాకుండా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ బహుమతులు సొంతం చేసుకున్నారు. రోజూ 2 గంటల పాటు సాధన చేసి బరిలో దిగితే పతకం రావాల్సిందేనంటూ దూసుకెళ్తున్నారు.
జాతీయస్థాయి జట్టులో బౌలర్‌గా: నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం దుద్యాల గ్రామానికి చెందిన సలాం, నశిమూన్ దంపతుల కుమారుడు కలాం క్రికెట్‌లో రాణిస్తున్నారు. ఇంజినీరింగ్ చదువుతూ పోటీల్లో పాల్గొంటున్నారు. సీఎస్‌ఈ డేటాసైన్స్‌లో 3వ ఏడాది చదువుతున్న కలాం కళాశాల తరఫున జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయ క్రికెట్ జట్టులో బౌలర్‌గా సత్తా చాటుతున్నారు.

2025 ఏడాదిలో చెన్నైలో జనవరి 16 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ సౌత్‌జోన్ యూనివర్శిటీ చాంఫియన్ షిప్‌లో జేఎన్‌టీయూ 'ఏ' తరఫున పాల్గొన్నారు. 2024 అక్టోబరు 7న నెల్లూరు ఆదిశంకరా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జేఎన్‌టీయూ 'ఏ' క్రికెట్ జట్టు ఎంపిక పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపరిచి జట్టులో స్థానం పొందారు. ఐఎస్‌పీఎల్‌లో పోటీల్లో పాల్గొని సెకండ్ లెవల్‌కు చేరుకున్నారు.
విధి వెక్కిరించినా విజయం సాధించింది - స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్‌లో రాణిస్తున్న విజయవాడ యువతి
రైల్వే ఉద్యోగం సాధించాలని: నంద్యాలకు చెందిన రమాదేవి, సురేష్‌బాబుల కుమారుడు జతిన్ ఇంజినీరింగ్‌లో డేటాసైన్స్ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతూ బాల్‌బ్యాడ్మింటన్‌లో ప్రతిభ చాటుతున్నారు. రైల్వేలో ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో చదువుతో పాటు క్రీడల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 2024 డిసెంబరు 6 నుంచి 8 వరకు కర్ణాటకలో జరిగిన 8వ ఫెడరేషన్ కప్ బాల్ బ్యాడ్మింటన్ చాంఫియన్ షిప్‌లో పాల్గొని మూడోస్థానంలో నిలిచారు.

2024లో చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన 8వ ఏపీ రాష్ట్ర జూనియర్ జిల్లా చాంఫియన్ షిప్‌లో పాల్గొని 3వ స్థానంలో నిలిచారు. 2023లో శ్రీకాళహస్తిలో, 2022 విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో, 2022లో శ్రీకాకుళంలో జరిగిన ఏపీ రాష్ట్ర జూనియర్ జిల్లా చాంఫియన్ షిప్ పోటీల్లో పాల్గొని 2వ స్థానంలో నిలిచారు.
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం: నంద్యాల మండలం పెద్ద కొట్టాలకు చెందిన రాజు, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు సందీప్‌కుమార్ ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా క్రీడా పోటీల్లో పాల్గొంటూ బహుమతులు సాధిస్తున్నారు. శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ 2వ ఏడాది చదువుతూ షటిల్‌లో రాణిస్తున్నారు. 7వ తరగతి నుంచే శిక్షణ పొంది సౌత్‌జోన్, నేషనల్, ఇంటర్ కాలేజీ గేట్ గేమ్స్ పోటీల్లో సత్తా చాటారు.

2025 ఏడాదిలో చిత్తూరు జిల్లా కలిగిరిలో నిర్వహించిన జేఎన్‌టీయూ ఇంటర్ కాలేజ్ గేట్ గేమ్స్‌లలో బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో రెండో స్థానం పొందారు. 2024, 2023 సంవత్సరాల్లో కర్నూలు జిల్లా బ్యాడ్మింటన్ చాంఫియన్ షిప్ అండర్-19 పురుషుల విభాగంలో పాల్గొని రెండో స్థానంలో నిలిచారు. అండర్ 13, 14, 17 టోర్నమెంట్లలో సింగిల్స్, డబుల్ విభాగంలో పాల్గొని ప్రతిభ కనబరిచారు.
ప్రతిభే ఆయుధం - అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తానంటున్న గాయత్రి
ఏపీ క్రీడాకారులకు తీపికబురు - ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం