ఇంజినీరింగ్ కొత్త ఫీజులు ఓ కొలిక్కి! - త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
హేతుబద్ధత ఆధారంగానే రుసుములు - విద్యాశాఖ ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం - నూతన కొలమానాల ఆధారంగా ఫీజులు నిర్ణయించనున్నట్టు చెబుతున్న విద్యాశాఖ వర్గాలు

Published : October 10, 2025 at 11:48 AM IST
Engineering Admission New Fees Update : తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలకు 2025-28 కాలానికి కొత్త ఫీజుల ఖరారు వ్యవహారం దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు రెండు రోజుల పాటు తుది సమావేశాలు జరిపి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే మిగిలి ఉంది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఆఫీస్‌లో త్వరలోనే సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సారి ఫీజుల పెంపు భారీగా ఉండకపోవచ్చనీ ర్యాంకింగ్, న్యాక్, పరిశోధనలు తదితర నూతన కొలమానాల ఆధారంగా ఫీజులు నిర్ణయించనున్నట్టు విద్యాశాఖ ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి.
భారీ పెంపు లేనట్టేనా ? : ఇంజినీరింగ్ కాలేజీల ఆదాయ, వ్యయాలను పరిశీలించి టీఏఎఫ్‌ఆర్‌సీ మూడు నాలుగు నెలల క్రితమే ప్రాథమికంగా ఫీజులపై ఓ నిర్ణయం తీసుకుంది. కొన్ని కళాశాలలైతే ఏకంగా భారీగా 60 నుంచి 70 శాతం ఫీజులు పెంచారు. ఈ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే కలగజేసుకొని ఇలా పెరుగుతూ పోతే చివరకు కన్వీనర్ కోటాలో చేరేందుకు కూడా విద్యార్థులు వెనకడుగు వేస్తారని అధికారుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పెంపుదలకు అసలు శాస్త్రీయత ఉందా? అని ప్రశ్నించారు.
శాస్త్రీయ ఆధారాలు చూపేందుకు : దీంతో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన విస్తృత కసరత్తులు చేశారు. టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు దాదాపు 160 కళాశాలల ప్రతినిధులతో పునర్విచారణ (రీ హియరింగ్) సమావేశాలు నిర్వహించారు. మళ్లీ కొత్త ఫీజులు ఖరారు చేశారు. దీని ప్రకారం అధిక శాతం కళాశాలలకు స్వల్పంగా, కొన్నింటికి గరిష్ఠంగా 20 నుంచి 30 శాతం మించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కళాశాలలు తమ ఫీజు ఖరారులో అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లినా, శాస్త్రీయ ఆధారాలు చూపేందుకు విద్యాశాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీబీఐటీ కళాశాల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
త్వరలోనే జీఓ : విద్యాశాఖ అధికారులు త్వరలో 2 రోజులపాటు టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులతో సమావేశమై చివరిసారిగా చర్చలు జరపనున్నారు. వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ తర్వాత కళాశాలల వారీగా ఫీజుల వివరాలతో కూడిన ఫైల్‌ను టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఫీజుల ఖరారుపై విద్యాశాఖ సెక్రటరీ జీఓ జారీ చేస్తారు.
మూడేళ్లకు ఒకసారి ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, బీఈడీ, మేనేజ్‌మెంట్ తదితర కళాశాలల వార్షిక ట్యూషన్ ఫీజులను సవరించాల్సి ఉంటుంది. ఆయా కళాశాలల ఆదాయ, వ్యయాలను పరిశీలించి సాధారణంగా టీఏఎఫ్‌ఆర్‌సీ కొత్త రుసుములను ఖరారు చేస్తుంది. ఈ క్రమంలో ఫీజులు పెంచుకునేందుకు కొన్ని కళాశాలలు తప్పుడు లెక్కలు చూపుతున్నాయని, అలాంటి వాటి భరతం పట్టాలని గత జూన్ నెలలోనే సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొన్ని కళాశాలలు కొత్త ఫీజులను నిర్ధారించి అమలు చేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలో కాలేజీలు ఫీజుల నిర్ధారణ కోసం సమర్పించిన ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలంటూ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
నాణ్యమైన ఇంజినీరింగ్ కాలేజీలకే ఫీజు పెంచుకునే ఛాన్స్ - నిబంధనలు ప్రకటించిన సర్కార్
పాత రుసుములతోనే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ - పెరిగితే ఎంత ఉండొచ్చంటే?

