Golden Hour for Heart Patients: వందల కిలోమీటర్ల దూరంలో రోగులున్నా వారి గుండె స్పందనను సెల్‌ఫోన్ ద్వారా గుర్తించగలుగుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుండె పనితీరును తెలియజేసే ఎలక్ట్రో కార్డియోగ్రాం (ఈసీజీ)ను ఫోన్ ద్వారా జీజీహెచ్‌లోని వైద్యులకు పంపుతున్నారు. గుండె స్పందనలో గుర్తించిన మార్పులను అనుసరించి వైద్యులు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
గుండెనొప్పికి గురైన వారికి 'గోల్డెన్ అవర్'లో అత్యవసర చికిత్స కింద ఉచితంగా కూటమి ప్రభుత్వం అందిస్తోన్న ఖరీదైన ఇంజక్షన్‌తో ప్రాణాలు నిలుస్తున్నాయి. గత ఏడాదిలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 150 మంది గుండె నొప్పి రోగులకు టెనెక్ట్ ప్లేస్ ఇంజక్షన్ ఇచ్చారు. ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ పేరుతో ఈ చికిత్సను అందిస్తున్నారు.
తప్పిన ప్రాణాపాయం: మాచర్లకు చెందిన 35 ఏళ్ల యువకుడికి ఛాతీనొప్పి రాగా అక్కడి ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. ఈసీజీ తీసి మొబైల్ యాప్‌లో పంపగా దానిని సర్వజనాసుపత్రి హృద్రోగ నిపుణులు సూచనల మేరకు స్వల్ప వ్యవధిలో 'టెనెక్ట్ ప్లేస్' సూదిమందు ఇవ్వడం వల్ల ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ తరహా చికిత్స పొంది గత సంవత్సరంలో 150 మంది రోగుల ప్రాణాలను కాపాడారు.
ఈసీజీ వివరాలు నేరుగా హబ్‌కు: గ్రామీణ ప్రాంతాల్లో గుండెకు సంబంధించిన సమస్యలతో జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లినప్పుడు వారికి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు సర్వజనాసుపత్రికి పంపేవారు. దూర ప్రాంతాల నుంచి జీజీహెచ్‌కు వచ్చేలోపే మార్గం మధ్యలోనే రోగులు మరణించేవారు. మరికొందరికి వ్యాధి తీవ్రత పెరిగేది. ఈ సమస్యను తగ్గించేందుకు టెలీ సెంటర్లతో ఆసుపత్రులను అనుసంధానం చేశారు.
గుండెపోటుకు గురైన వారు ఈ ఆసుపత్రులకు వస్తే అక్కడి వైద్యులు, సిబ్బంది పరీక్షలు నిర్వహించి ఈసీజీ ఇతర వివరాలను అనుసంధాన హబ్‌కు సెల్‌ఫోన్ ద్వారా పంపుతారు. జీజీహెచ్‌లో అందుబాటులో ఉండే కార్డియాలజిస్ట్ రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా టెనెక్ట్ ప్లేస్ ఇంజక్షన్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక యాప్ రూపొందించారు.
రూ.45,000 ఖరీదు చేసే ఇంజక్షన్‌ను ఉచితంగా అందజేసిన అనంతరం తగిన జాగ్రత్తలను సూచిస్తూ రోగిని జీజీహెచ్‌కు పంపుతున్నారు. సర్వజనాసుపత్రికి వచ్చిన అనంతరం బాధితుడికి చికిత్స ప్రారంభిస్తారు. తర్వాత యాంజియోగ్రామ్ చేసి వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు. అవసరమైతే స్టెంట్ అమర్చుతున్నారు. కొందరికి బైపాస్ సర్జరీ అవసరమవుతుంది.
రోగులకు ఎంతో మేలు: ఈ తరహా చికిత్సతో రోగులకు ఎంతో మేలు జరుగుతోందని కార్డియాలజీ విభాగం అధిపతి ఆచార్య శ్రీకాంత్ తెలిపారు. ఎలాంటి అనుమతుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి సూదిమందు సిఫార్సు చేస్తున్నామని వివరించారు. ఇంజక్షన్లు అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని దీనివల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడగలుగుతున్నామని అన్నారు. అంతేగాక వారిని నేరుగా జీజీహెచ్‌కు పంపుతున్నందున సకాలంలో మెరుగైన చికిత్స అందించగలుగుతున్నామని శ్రీకాంత్ తెలిపారు.
"గుండెపోటు" ముందుగానే ఇలా హెచ్చరిస్తుందట - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
మితిమీరిన కోపం మీ గుండెకు ప్రమాదమా? - నిపుణులు ఏమంటున్నారంటే!