Strict Actions Against Illegal Current Pole Connection : విద్యుత్తు స్తంభాలను ప్రైవేట్ వ్యక్తులు ఉచితంగా వాడుకుంటామంటే ఇక నుంచి కుదరదు. స్తంభాలను ఎవరు వాడినా ప్రతి నెలా తమకు పన్నులు చెల్లించాలని విద్యుత్తుశాఖ నిర్ణయించింది. గతం నుంచే ఈ పన్నుల విధానం ఉన్నా తక్కువ మందే పన్నులు చెల్లిస్తున్నారు. అందుకే క్షేత్రస్థాయిలో మరోమారు స్తంభాలను లెక్కించి పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేయాలని విద్యుత్తు అధికారులు నిర్ణయించారు. విద్యుత్తు స్తంభాల సేవలు పొందుతున్న కేబుల్ ఆపరేటర్లు, అంతర్జాల ప్రొవైడర్లు ఇకపై తప్పకుండా పన్నులు చెల్లించాలని ఆదేశించారు.
పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలను గమనిస్తే తీగల చిక్కుముళ్లు కనిపిస్తాయి. అందులో కేబుల్ టీవీ, అంతర్జాలం కేబుళ్లతో పాటు విద్యుత్తు తీగలు అన్ని కలిసిపోయి ఉంటున్నాయి. అందుకే కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు 15 రోజుల వ్యవధిలో వారి కేబుళ్లను సక్రమంగా సర్ది పెట్టుకోవాలని తెలిపారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కనెక్షన్లు లేని తీగలను స్తంభాల నుంచి పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. చాలా మంది తమ కేబుల్ కనెక్షన్లను ఇతరులకు విక్రయించుకున్నారు.
వారం పది రోజుల్లో ప్రక్రియ పూర్తి : ప్రైవేట్ వ్యక్తులు గ్రామాల్లో విద్యుత్తు స్తంభం వాడితే నెలకు రూ.15, పట్టణాల్లో అయితే రూ.20 చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. ఈ విధానం చాలా రోజుల నుంచే అమలులో ఉంది. అయితే కొందరు ఆపరేటర్లు తూతూమంత్రంగా పన్నులు చెల్లిస్తున్నారు. దీంతో జిల్లాకేంద్రాలతో పాటు మండలకేంద్రాలు, గ్రామాల్లో టీవీ ఆపరేటర్లు, అంతర్జాల ప్రొవైడర్లు ఎన్ని విద్యుత్తు స్తంభాలను వాడుతున్నారో సర్వే చేయాలని నిర్ణయించారు. అన్నిచోట్ల సర్వీస్ ప్రొవైడర్లు, విద్యుత్తు అధికారులు కలిసి సంయుక్తంగా సర్వే చేయాలని నిర్ణయించారు. వారం పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
స్తంభం చుట్టూ చిక్కుముళ్లతో తీగలు : విద్యుత్తు స్తంభాలను ప్రైవేట్ ఆపరేటర్లు వాడితే తప్పకుండా పన్నులు చెల్లించాలని కామారెడ్డి ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రవణ్ కుమార్ తెలిపారు. ముందుగా కేబుల్ వైర్లను క్రమపద్ధతిలో అమర్చుకోవాలని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు వదిలివేస్తామంటే వైర్లను తొలగిస్తామని హెచ్చిరించారు. స్తంభం చుట్టూ చిక్కుముళ్లతో తీగలు ఉండడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది స్తంభం ఎక్కి మరమ్మతులు చేయడం కష్టంగా మారిందని అన్నారు.
ఆసుపత్రుల్లో కరెంట్ లేకుంటే ఎలా? - అధికారులతో మంత్రి దామోదర రివ్యూ
గ్రేటర్లో స్మార్ట్ పోల్స్ - ఫ్యూచర్‌సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు : సీఎం రేవంత్