ETV Bharat / state

మీ పిల్లల్లో ఈ అలవాటు ఉందా - వారిని సరిదిద్దే బాధ్యత మీదే!

పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తూ ఉంటారు - సరైన మార్గనిర్దేశం అవసరమంటున్న నిపుణులు

Effective Parenting tips
Effective Parenting tips (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 17, 2025 at 8:21 AM IST

2 Min Read
Choose ETV Bharat

Effective Parenting Tips: తప్పొప్పులు తెలియని వయసులో నచ్చిన వస్తువు ఎలాగైనా పొందాలని చిన్నపిల్లలు భావిస్తుంటారు. స్నేహితుల ప్రలోభం వలన, ఇంకేదైనా ఆలోచన వలన కానీ కొంతమంది పిల్లల్లో చేతివాటం కనిపిస్తుంది. అయితే అంతమాత్రాన పిల్లలపై దొంగ అనే ముద్ర వేయొద్దు. అలా అని అటువంటి పనులను చూస్తూ ఉండకూడదు. కచ్చితంగా అటువంటి పనులు తప్పు అని చెప్పాలి. తల్లిదండ్రులుగా జాగ్రత్తగా వారిని సరిదిద్దే బాధ్యత మీపైన ఉంటుంది. దీనిపై మరిన్ని విషయాలను విశాఖపట్నంకి చెందిన మానసిక వైద్య నిపుణులు ప్రసన్న కుమార్ తెలిపారు.

పిల్లలు చిన్నప్పటి నుంచి తమ చుట్టూ ఉన్న వారిని, పరిసరాలను పరిశీలిస్తూ అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. తెలిసీ తెలియని తనంతో కొంతమంది పిల్లలు కొన్నిసార్లు తోటివారి వస్తువులను అపహరిస్తూ ఉంటారు. పిల్లల్లో ఇటువంటి ప్రవర్తన గమనించినప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహజంగా ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే, పిల్లలు ఇలా చేయడం వెనుక కారణాలను అర్థం చేసుకోవాలి. సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా పిల్లల్లో ఈ అలవాటును మాన్పించవచ్చని నిపుణులు అంటున్నారు.

ఎందుకు?: చిన్నపిల్లలు తాము చేస్తున్న పనులలో తప్పొప్పుల మధ్య తేడాలను అర్థం చేసుకోలేరు. తమకు ఇష్టమైన వస్తువును చూసినప్పుడు అది కావాలనే కోరికతో కొంతమంది చిన్నారులు ఇలా చేస్తుంటారు. ఇంట్లో, స్కూల్​లో వారిపై తగినంత శ్రద్ధ లేనప్పుడు ఇలాంటి పనులకు అలవాటు పడుతూ ఉండొచ్చు. స్నేహితులు ఇలా చేయడం చూసి వాళ్లు కూడా అదే పనిని చేయడానికి మళ్లీమళ్లీ ప్రలోభపట్టే అవకాశం ఉంది. అదే విధంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే, కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయలేకపోతే వాటిని వేరే దగ్గర చూసినప్పుడు అపహరణలకు పాల్పడవచ్చు. చిన్నారులలో ఇది సాధారణంగా జరుగుతుంది.

ఎలా మాన్పించాలి?: ఏదైనా విషయం చెప్పేటప్పుడు పిల్లలతో ప్రేమగా, ఓర్పుతో మాట్లాడాలి. ఏ కారణాల వల్ల వారు ఇతరుల వస్తువులు తీసుకున్నారు, ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకోవాలి. ఏది తప్పో? ఏది ఒప్పో వారికి అర్థమయ్యేలా వివరంగా చెప్పాలి. తమ తప్పులను తెలుసుకుని, వాటిని సరిదిద్దుకోవడానికి పిల్లలకు అవకాశం ఇవ్వాలి. మీ పిల్లలలు స్కూల్​, ఆటల సమయాల్లో ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారో తెలుసుకోవాలి. స్నేహితుల ప్రభావం వల్ల వారు ఇలా ప్రవర్తిస్తున్నారోమో గమనిస్తూ ఉండాలి. ఏదైనా వస్తువును దొంగిలించినప్పుడు వారిని శిక్షించడం కానీ, ఇష్టం వచ్చినట్లు తిట్టడంలాంటివి కానీ చేయకూడదు. వారిని పదే పదే దొంగ అంటూ నిందించడం ఎంతమాత్రం మంచిది కాదు. ఇది వారి మనసుపై తీవ్ర ప్రభావం చూపించొచ్చు.

దొంగతనం చేయడం మంచిది కాదని, నమ్మకం, విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమని వారికి తెలియజెప్పాలి. ఈ ప్రవర్తన వల్ల ఇతరులు ఎలా బాధపడతారో, ముందుముందు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఉదాహరణలతో సహా వివరించాలి. చదువు, ఆటల్లో నిమగ్నం చేయడం ద్వారా మీ పిల్లల్లో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నీతి కథలు చెప్పడం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఒకవేళ పిల్లల ప్రవర్తన ఆందోళనకరంగా ఉంటే మానసిక వైద్య నిపుణులను సంప్రదించి, వారి సలహాలు తీసుకోవటం ఉత్తమం.

'మరక మంచిదే!' ఏ మరక ఎలా పోతుందో తెలుసా? - నిపుణుల సూచనలివీ!

పిల్లలు బరువు పెరగట్లేదా? - ఇలా ట్రై చేస్తే బెటర్ అంటున్న నిపుణులు!