King Cobra is on The Endangered List : దట్టమైన అటవీసంపదకు పెట్టింది పేరు తూర్పుకనుమలు. ఎతైన కొండలు, లోయలు జీవ వైవిధ్యానికి నెలవు. ఎన్నో అరుదైన జంతుజాలము, పక్షులు, సరీసృపాలకు ఇక్కడ కొదవ లేదు. అరుదైన సర్పజాతులు ఇక్కడ కనిపిస్తాయి. అయితే వాటిల్లో కొన్ని అంతరించిపోతున్న జాబితాలో చేరాయి. వాటిల్లో అతి ముఖ్యమైనంది కింగ్‌కోబ్రా. దాదాపు పది అడుగుల పైనే ఉండే ఈ విషసర్పాన్ని స్థానికంగా గిరినాగు అంటారు.
అడవుల్లో నుంచి ఇళ్లల్లోకి చేరుతున్న వీటిని గిరిజనులు కొట్టి చంపడం, రోడ్లపైకి వచ్చి వాహనాల కిందపడి చనిపోవడం వల్ల కొన్నాళ్లుగా వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. అరుదైన ఈ నాగజాతిని కాపాడుకునేందుకు ఈస్ట్రన్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ ముందుకొచ్చింది. వీటి గుడ్లను సంరక్షించడం ద్వారా ఈ జాతిని కాపాడాలని నడుం బిగించింది. అటవీశాఖ అనుమతితో శాస్త్రీయ పద్ధతిలో గుడ్లను సంరక్షిస్తోంది.
సంరక్షిస్తోన్న వైల్డ్‌లైఫ్ సొసైటీ : అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలంలోని కింగ్‌కోబ్రా ఉన్నట్లు గిరిజనుల ద్వారా సమాచారం సేకరించిన సొసైటీ ప్రతినిధులు స్వయంగా వెళ్లి పరిశీలించారు. సమీపంలోని అటవీ ప్రాంతంలోనే ఇది గుడ్లను పొదుగుతోందని గమనించారు. ఆడ కోబ్రా బయటకు వెళ్లిపోయిన తర్వాత పొదిగిన పిల్లలు గూడు నుంచి బయటకు రాకుండా చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేశారు. అటవీ జంతువుల నుంచి వాటిని రక్షించారు. కింగ్‌కోబ్రా పిల్లలు కొంత పెద్దవిగా అయిన తర్వాత వాటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కొత్తగా 30 గిరినాగులు అటవీప్రాంతంలోకి వచ్చినట్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ సభ్యులు తెలిపారు.
"గిరినాగులు అనేవి పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ గిరినాగులు వేరే పాములను తింటుంది. నాగుపాము, రక్తపింజర, గిరి పింజర, కట్లపాము, జెర్రిపోతు వంటి పాములను తింటుంది. ఇలాంటి జాతులను తిని వీటి జనాభా నియంత్రణకు తోడ్పడుతుంది. ప్రపంచంలో గూడు పెట్టే ఏకైక పాము గిరినాగు. ఆ గుడ్లు మీద దాదాపు రెండు నెలలు వరకు కూర్చుని ఉంటుంది. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఆడ గిరినాగు బయటకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో మనం గూడును సంరక్షించాలి. అడవి పందులు, నక్కలు వంటివి తవ్వేసి వాటిని తినేసేందుకు సిద్ధపడతాయి. అందుకే గుడ్ల గూడు చుట్టూ పెన్సింగ్ లాగా ఏర్పాటు చేసి గుడ్లను వాటిని నుంచి రక్షిస్తాం." - మూర్తి కంటి మహంతి, ఈస్ట్రన్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ వ్యవస్థాపకుడు
King Cobra In Kitchen Viral Video : కిచెన్‌లోకి 15 అడుగుల కింగ్ కోబ్రా.. ఒక్కసారిగా మహిళలు భయపడి..