Eagle Chief RK Ravikrishna On Drug Free Andhra Pradesh : అశ్లీల వెబ్‌సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ‘ఈగల్’ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. ముగ్గురు నిందితులను గుంటూరులో పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ‘‘అశ్లీల వెబ్‌సైట్లకు నిందితులు వీడియోలను అందిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. గుంతకల్లుకు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. వాటిని నిషేధిత వెబ్‌సైట్లకు విక్రయిస్తున్నాడు. సైప్రస్ దేశానికి చెందిన సైట్ నిర్వాహకులు ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తున్నారు. లూయిస్‌తో పాటు శ్రీకాకుళానికి చెందిన గణేశ్, జ్యోత్స్నలను అరెస్ట్ చేశాం’’ అని రవికృష్ణ తెలిపారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దాలనే కూటమి ప్రభుత్వ లక్ష్య సాధనకు అనుగుణంగా ఈగల్ సెల్ నిర్విరామంగా పని చేస్తోందని ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల బారిన పడి జీవితాలను పాడు చేసుకోకుండా యువతకు అవగాహన కల్పిస్తూనే, డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు విస్తృత కార్యచరణ రూపొందించామని చెప్పారు. ఇప్పటికే ఆపరేషన్ గరుడ పేరిట రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపినట్లు వెల్లడించారు. మరోవైపు పెరిగిపోతున్న సైబర్ నేరాల నియంత్రణ కోసం జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఐజీ రవికృష్ణ స్పష్టం చేశారు.
వైద్యుల సిఫార్సు లేకుండా మందులు విక్రయాలు చేస్తున్న ఔషధ దుకాణాలపై ఈగల్ విభాగం, డ్రగ్ కంట్రోల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఇప్పటికే దాడులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఔషధ దుకాణాలపై ఆపరేషన్ గరుడలో భాగంగా 100 బృందాలతో ఆకస్మిక దాడులు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసుల సంయుక్త తనిఖీలు చేపట్టారు.
గంజాయి సాగుపై డ్రోన్లతో నిఘా : గంజాయి సాగుకు వ్యతిరేకంగా రైతుల్లో చైతన్యం తెచ్చేందుకు ఈగల్ అధిపతి ఆకే రవికృష్ణ, పోలీసులు, వివిధ శాఖల సమన్వయంతో రంగంలోకి దిగారు. ఎవరైనా గంజాయి వేస్తే, చట్టపరంగా ఎదుర్కోవాల్సిన కేసులు, పర్యవసానాలపై సాగు చేసే వారికి అవగాహన కల్పిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో గంజాయి ఉనికిని గుర్తించేందుకు పోలీసు అధికారులు డ్రోన్లతో నిఘా పెట్టారు. గతంలో గంజాయి వేసిన చోట ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేశారో డ్రోన్ల సాయంతో పరిశీలిస్తున్నారు. డ్రోన్ల ద్వారా గంజాయి తోటలను గుర్తించిన ప్రాంతాల్లోకి ఈగల్ బృందాలను పంపించి, ధ్వంసం చేస్తున్నారు.
భవిష్యత్తులో మరింత ఉద్ధృతం : కూటమి ప్రభుత్వం వచ్చాక గత 9 నెలల వ్యవధిలో నమోదైన ప్రతి గంజాయి కేసులోనూ ఫైనాన్షియల్ ఇన్విస్టిగేషన్ చేయిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల్లోని ఎస్పీలు, డీఎస్పీలు, ఎస్‌హెచ్‌వోలకు ఈగల్ ఆధ్వర్యంలో శిక్షణనిచ్చారు. నమోదయ్యే ప్రతి కేసులోనూ స్మగ్లర్లకు సంబంధించిన ఆర్థిక మూలాలను వెలికితీస్తామని ఆకే రవికృష్ణ తెలిపారు. వారి ఆస్తులన్నీ జప్తు చేయిస్తాం, భవిష్యత్తులో ఇది మరింత ఉద్ధృతమవుతుందని స్పష్టం చేశారు.
నిరక్షరాస్యులే వీరి టార్గెట్ - 158 మెడికల్ షాపులపై కేసులు నమోదు
గంజాయి కేసుల్లో 20 ఏళ్లు జైలు - మళ్లీ నేరం చేస్తే మరణశిక్ష!: ఈగల్ విభాగాధిపతి రవికృష్ణ