Drugs Trafficking With elderly Persons : ఆమె వయసు ఏడుపదులు ఉంటుంది. చేతిలోని ఓ సంచితో కూరగాయల మధ్యలో గంజాయిని గమ్యానికి చేరవేస్తుంది. ప్రతి నెలా రూ.లక్షల విలువైన సరకును గంజాయి కొనుగోలుదారులకు అందజేసింది. దీనిపై చుట్టుపక్కల వారిచ్చిన సమాచారంతో నిఘా ఉంచిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి బ్యాంకు అకౌంట్లో భారీ ఎత్తున లావాదేవీలు చూసి పోలీసులు నివ్వెరపోయినట్టుగా సమాచారం. మత్తు పదార్థాల రవాణాపై ప్రభుత్వం కఠినవైఖరి అవలంభించటంతో డ్రగ్స్ ముఠాలు రూటు మార్చి అడ్డదారుల్లో సరకు రవాణా చేస్తున్నాయి.
ఇటీవల వెలుగు చూసిన వరుస ఘటనలతో : ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చినటువంటి వరుస ఘటనలతో హైదరాబాద్ నగర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (హెచ్‌న్యూ), తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీన్యాబ్)లు అప్రమత్తమై లింకులను ఛేదించడానికి సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో ఏడాది వ్యవధిలోనే టీజీన్యాబ్ రూ.200 కోట్ల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఆమె సరఫరా చేసే వాటిలో గంజాయి అధిక శాతం ఉంటోంది. తాజాగా హెచ్‌న్యూ పోలీసులు ఓషన్‌గంజా (ఓజీ) నెట్‌వర్క్ గుట్టురట్టు చేశారు. థాయ్‌లాండ్ నుంచి సముద్రమార్గం ద్వారా దేశంలోని ప్రధాన నగరాలకు సరఫరా అవుతున్నట్టుగా తేల్చారు. ఓజీ కిక్‌కు బానిసలైన వారిలో ఐటీ నిపుణులు, ప్రముఖ కంపెనీల సీఈవోలు, డాక్టర్లు సైతం ఉన్నారు. కొరియర్ ద్వారా నగరం చేరిన ఓజీ ప్యాకెట్స్‌ను వృద్ధుల ద్వారా కొనుగోలుదారులకు అందజేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఎందుకిలా రూటు మార్చారంటే : మాదకద్రవ్యాల సరఫరాపై పోలీసులు నిఘా పెంచారు. డ్రగ్స్‌కు అలవాటుపడిన వారి కదలికలను డేగకన్నుతో గమనిస్తున్నారు. డ్రగ్స్‌ను తీసుకుంటూ పట్టుబడిన సమయంలో మారేందుకు అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడుతున్నారు. కొంతకాలం వారు మారినట్టుగా కనిపించినప్పటికీ క్రమంగా ప్రాంతం, సిమ్‌కార్డులను మార్చి లావాదేవీలను నిర్వహిస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు రెండోసారి మాదకద్రవ్యాలకు చిక్కినప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో డ్రగ్స్ ముఠాలు ప్రత్యామ్నాయంగా వృద్ధులను ఏజెంట్లుగా మలచుకుంటున్నారు.
వృద్ధులను పావులుగా మార్చుకుని : వారి ద్వారా గంజాయి, ఆల్ఫ్రాజోలం రవాణా చేయిస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. కుటుంబసభ్యుల ఆదరణకు నోచుకోని పెద్దలు, ఇంటినుంచి బయటకువచ్చి ఒంటరిగా బతుకీడ్చుతున్న వృద్ధులను ముఠాలు టార్గెట్‌గా చేసుకుని కమీషన్, మద్యం ఆశచూపి సరకును చేతికిస్తున్నారు. ముఠాలోని ఒకరు వృద్ధులు సరకు గమ్యస్థానానికి చేరవేసేంత వరకూ అనుసరిస్తారు. ఆంధ్రప్రదేశ్, ఏవోబీ నుంచి (ఆంధ్ర ఒడిశా బోర్డర్) గంజాయి తరలించేందుకు అంతర్రాష్ట్ర ముఠాలు వయోధికులను పావులుగా మలచుకోవటం నిజమేనని నగరానికి చెందిన ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. గతంలో మహిళలు, చిన్న పిల్లలను వాడుకునేవారని, వారికి బదులుగా ప్రస్తుతం వృద్ధులను ఏజెంట్లుగా తయారు చేస్తున్నట్టుగా గుర్తించామన్నారు.
మత్తుకు బానిసలుగా మారుతున్న వైద్యులు - ఈ పరిస్థితికి కారణం అదేనట!
మాదకద్రవ్యాల ఉచ్చులో నవ యువత, బడిపిల్లలు - మత్తుకోరలు పీకేదెప్పుడు?