ETV Bharat / state

యథేచ్ఛగా నిషేధిత ఇంజక్షన్ల వినియోగం - పశ్చిమబెంగాల్, ఒడిశాల నుంచి భారీగా దిగుమతి

మత్తు కోసం వినియోగిస్తున్న వ్యక్తులు - రూ.50 ఉన్న ఇంజెక్షన్ రూ.200 నుంచి రూ.500 వరకు విక్రయం

Drug Injuctions Increasing in Vizag City
Drug Injuctions Increasing in Vizag City (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2025 at 12:57 PM IST

2 Min Read
Choose ETV Bharat

Drug Injuctions Increasing in Vizag City: గత ఐదేళ్లు విశాఖ నగరం గంజాయి, మాదకద్రవ్యాలకు నిలయంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడంతో పరిస్థితి కొంత వరకు అదుపులోకి వచ్చింది. కానీ, మత్తు ఇంజక్షన్ల బెడద మాత్రం తగ్గలేదు. నగరంలో తరచూ అవి పట్టుబడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 760 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి నిషేధించిన మత్తు ఇంజక్షన్లు ఇక్కడికి వస్తున్నాయని, యువత వాటికి బానిసలుగా మారుతున్నారని పోలీసు యంత్రాంగం గుర్తించింది.

శస్త్రచికిత్సలు చేసేటప్పుడే వినియోగించాలి: మత్తుకు బానిసైన యువత తక్కువ ఖరీదుతో కూడిన ఈ మత్తు పదార్ధాలు, ఇంజక్షన్లు, వైట్​నర్, నెయిల్‌ పాలిష్‌ వంటి వాటిని తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా మత్తు ఇంజక్షన్లనేవి మార్కెట్‌లో అందుబాటులో ఉండవు. వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఔషధ దుకాణాల్లో వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్‌ ఆధారంగా వీటిని విక్రయిస్తారు. కొనుగోలు చేసిన వారి పేర్లు కూడా నమోదు చేస్తారు. కాన్పులు, శస్త్రచికిత్సల సమయంలో, నొప్పులు భరించలేనప్పుడు రోగులకు మత్తు ఇంజక్షన్‌ ఇస్తారు. ఫలితంగా రోగి 6 నుంచి 8 గంటల వరకు మత్తులో ఉండటంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాంటి ఇంజక్షన్లు ప్రస్తుతం సాధారణ వ్యక్తులు మత్తు కోసం వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

డిమాండ్​ను అనుసరించి ధర: నగరానికి చెందిన కొద్దిమంది పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం ఖరగ్‌పూర్, ఒడిశాలోని కటక్, భువనేశ్వర్‌ల నుంచి మత్తు ఇంజక్షన్లను అధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నారు. ఒక్కో బాక్సులో 50 యాంపిల్స్‌ ఉంటాయి. ఒక్కొక్క ఇంజక్షన్‌ ధర దాదాపు అక్కడ రూ.50 ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చేసరికి యువతకు రూ.200 నుంచి రూ.500 వరకు అధిక మొత్తానికి విక్రయిస్తున్నారు. గతంలో ఒకరిద్దరు వ్యాపారులు వీటిని విక్రయించేవారు. ప్రస్తుతం 5 నుంచి 10 మంది ఉన్నారని అంచనా. వీటిని వినియోగించేవారు పెద్ద సంఖ్యలో ఉండొచ్చని సమాచారం.

పరిధి దాటితే ప్రమాదకరం: కొందరు స్వయంగా చేతికి ఇంజక్షన్ చేసుకుంటున్నారు. మత్తు ఇంజెక్షన్లు తీసుకోవడం మద్యం కన్నా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. వీటిని తరచూ తీసుకోవడం ద్వారా నరాల కేంద్రీకృత వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తద్వారా మానసిక సమస్యలు సైతం తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మోతాదు మించి తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదమని పేర్కొంటున్నారు.

అత్యంత కఠినంగా ఎన్‌డీపీఎస్‌ యాక్ట్ - గంజాయి కేసుల్లో చిక్కితే 20 ఏళ్లు కటకటాలే!

మెడికల్ షాప్​లలో మత్తు మందుల విక్రయం - ఈగల్​ తనిఖీలో వెలుగులోకి