Drone Spotted in Tirumala : తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. శ్రీవారి ఆలయంపై రాజస్థాన్‌కు చెందిన యూట్యూబర్ పది నిమిషాల పాటు డ్రోన్ ఎగురవేశాడు. ఆస్థాన మండపం మెట్ల మీద నాదనీరాజనం మండపం ఎదురుగా ఉంటూ డ్రోన్ కెమెరాను గాలిలోకి ఎగురవేసిన యూట్యూబర్ అక్కడ నుంచిడ్రోన్ ఆపరేట్ చేస్తూ మహాద్వార గోపురం సహా పరిసర ప్రాంతాలను చిత్రీకరించారు.
గాలిలో ఎగరుతున్న డ్రోన్‌ను చూసిన భక్తులు, స్థానికులు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో డ్రోన్ కెమెరా ఎగురవేసిన యూట్యూబర్‌ను టీటీడీ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో ఉన్న మూడు అంచెల భద్రతను దాటి డ్రోన్ కెమెరాను తిరుమల కొండకు ఎలా తీసుకు రాగలిగారన్న దానిపై భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు.
రాజస్థాన్‌కు చెందిన యూట్యూబర్ విద్యుద్దీప కాంతుల్లో ఆనంద నిలయం వెలుగులను చిత్రీకరించేందుకు యత్నించి టీటీడీ భద్రతావిభాగ అధికారులకు దొరికిపోయాడు. తిరుగిరులను అనువణువూ చిత్రీకరించిన తీరు అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. గతంలోనూ శ్రీవారి ఆలయంపై అగంతకులు డ్రోన్ ఎగరేసిన ఘటనలు చాలా ఉన్నాయి.
తిరుమల దర్శనం - ప్రజాప్రతినిధులకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక పోర్టల్