DR PEDA VEERRAJU ABOUT TELUGU: డాక్టర్‌గా రోగులకే కాదు తెలుగును తక్కువగా చూసేవారికి కూడా ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు ప్రముఖ వైద్యుడు పెదవీర్రాజు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH) గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతిగా ఉద్యోగ విరమణ చేసిన ఆయన, తన వద్దకు వచ్చే రోగులకు మాతృభాషపై మమకారాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మార్నింగ్ వాకింగ్‌కి వచ్చే వారికి చిన్నచిన్న పదబంధాలతో మార్నింగ్ ట్రీట్ ఇస్తుంటారు. తెలుగు భాషా మాధుర్యాన్ని ఇలా ఎవరూ రుచి చూపించలేదంటూ అందరూ ఆయన్ను చప్పట్లో ముంచెత్తుతున్నారు.
డాక్టర్ పెదవీర్రాజు వయసు 72 ఏళ్లు. రోజూ ఉదయం విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో వ్యాయామం చేస్తూ ‘తెలుగు రాదా?’ అని ప్రశ్నిస్తూ ముందుకు సాగుతుంటారు. తెలుగు భాష మాధుర్యాన్ని అందరికీ విడమర్చి చెబుతుంటారు. కవితలు, పద్యాలు వల్లె వేస్తుంటారు. ప్రస్తుత సమాజంలోని వైరుధ్యాలను, విభేదాలను కవితాత్మకంగా వివరిస్తున్న పెదవీర్రాజు, అనర్గళంగా తెలుగులో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. తెలుగు ఏమైపోతుందనే ఆందోళనతో, భాష గొప్పతనం గురించి అందరినీ అప్రమత్తం చేస్తున్నానని పెదవీర్రాజు అంటున్నారు.
డాక్టర్ పెదవీర్రాజు గురించి: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామ సమీపంలోని వాకతిప్ప గ్రామానికి చెందిన పెదవీర్రాజు, విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేశారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీలో డీఎం కోర్సు హైదరాబాద్‌లో పూర్తి చేసిన తరువాత, విశాఖ కేజీహెచ్‌లో ఉదరకోశ వ్యాధుల విభాగంలో సహ ఆచార్యునిగా జాయిన్ అయ్యారు. అనంతరం అదే విభాగానికి అధిపతిగా సుదీర్ఘకాలం పని చేసిన ఆయన ఉద్యోగ విరమణ చేశారు. ఇప్పుడు వైద్యసేవలతో పాటు, తెలుగు భాష విస్తృతి కోసం తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు.
గత కొన్నేళ్ల నుంచి సమాజాన్ని గమనిస్తే ఆంగ్లభాషపై మోజు పెరుగుతున్నట్లు కనిపిస్తోందని, మా వాడికి తెలుగు రాదంటూ తల్లిదండ్రులు గర్వంగా చెబుతుంటే బాధేస్తోందని పెదవీర్రాజు తెలిపారు. తెలుగులోని కమ్మదనం, నన్నయ్య, తిక్కన పద్యాల్లోని మాధుర్యం, వేమన శతకంలోని నీతులు పిల్లలకు చేరడం లేదని, తెలుగు సాహిత్యాన్ని నేటితరం అందుకోలేకపోతోందని పెదవీర్రాజు అంటున్నారు. ఇదే సమయంలో ఆంగ్లం పైనా పట్టు సాధించలేకపోతున్నారని, దీంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతున్నారని ఈయన పేర్కొన్నారు.
ఉదయం లేవగానే ‘గుడ్ మార్నింగ్’ అనో, ఉగాది రోజు కూడా ‘విష్ యూ హ్యాపీ ఉగాది’ అనో అంటున్నారని, ఈ పరిస్థితి మారాలని చెప్పుకొచ్చారు. అందుకే ‘మీకు తెలుగు రాదా’ అని అందరినీ ప్రశ్నిస్తూ భాషపై అవగాహన కల్పిస్తున్నానని, తెలుగు బోధనతో పాటు, నీతి పద్యాల సారాన్ని నేటితరానికి తెలియజేయాలని సూచించారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పెదవీర్రాజు కోరారు.
తాను ఇప్పటివరకు 3 పుస్తకాలు రచించి (మరో సంకల్పం, కవితా స్రవంతి, శత కవితాఝరి) తెలుగు గొప్పతనాన్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నానని పెదవీర్రాజు అన్నారు. నన్నయ్య, పోతన, వేమన, గుర్రం జాషువా, దువ్వూరి రామిరెడ్డి, జంధ్యాల పాపయ్యశాస్త్రి వంటి ప్రముఖుల పద్యాలను ఇటీవల ఏకధాటిగా చదివి వినిపించానని చెప్పారు. తన వద్దకు వచ్చే రోగులకు కవితలతో ప్రేరణ కల్పిస్తున్నానని, మద్యపానం, ధూమపానం, ఊబకాయంతో కలిగే సమస్యల గురించి కవితల రూపంలో తెలియజేస్తున్నానని అన్నారు. తెలుగు గొప్పదనాన్ని నేటి తరానికి తెలియజేయడమే తన లక్ష్యం అని పెదవీర్రాజు తెలిపారు.
మాతృభాషపై మమకారం - పరాయి గడ్డపైనా తెలుగు వెలుగులు
పద్యాలపై అభిమానం - అందరికీ నేర్పిస్తూ తెలుగు భాషాభివృద్ధికి పాటు