Diwan Cheruvu Bridge Problems At Rajamahendravaram: రాజమహేంద్రవరం సమీపం దివాన్ చెరువులో పై వంతెన నిర్మాణం నిమిత్తం రహదారి విస్తరణకు ప్రభుత్వం ఏడేళ్ల క్రితం భూ సేకరణ చేసింది. ఎంత వరకు భూమిని తీసుకుంటారో మార్కింగ్ ఇచ్చింది. ప్రస్తుతం పై వంతెన నిర్మాణం నిమిత్తం రహదారి పక్కనున్న దుకాణాలు, నివాస గృహాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు చెందిన భవనాలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) తొలగించే కార్యక్రమం చేపట్టింది.
గతంలో తమకు పరిహారం ఇచ్చి, మార్కింగ్ ఇచ్చిన దానికంటే ఎక్కువ భూమిని తీసుకుంటూ ఆ మేరకు కట్టడాలు కూల్చివేస్తున్నారని సంబంధిత కట్టడాల యాజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కట్టడాల కూల్చివేతను సంబంధిత యజమానులు శనివారం అడ్డగించారు. అదనంగా తీసుకుంటున్న భూమికి పరిహారం ఇవ్వకుండా ఎలా కూలుస్తారని వారు ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పేవరకు కట్టడాల తొలగింపు చర్యను నిలిపివేయాలని యంత్రాలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎన్హెచ్ఏఐ పీడీ సంఘటనా స్థలానికి చేరుకుని భూ యజమానులతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు.
ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లిన పీడీ:రహదారి విస్తరణలో మార్కింగ్ విషయంలో ఆయా భూయజమానులు లేవనెత్తిన సమస్యను ఎన్హెచ్ఏఐ పీడీ సురేంద్రనాథ్ రాజమహేంద్రవరం ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తక్షణమే స్పందించి సోమవారం సర్వేయర్ల తో సదరు మార్కింగ్ విషయాన్ని పరిశీలించి, అవసరమైతే రికార్డులు పరిశీలించి, మరోసారి సర్వే నిర్వహించి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రాజానగరం తహశీల్దారు జీస్ఎఎల్ఎస్ దేవి ని ఆదేశించారు. సోమవారం ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్టు ఆమె తెలిపారు.
''నేషనల్ హైవే వాళ్లు 2018 లో వచ్చి మా అందరి ఇంటి దగ్గర్లో మార్కింగ్ చేశారు. తరువాత దానికి సంబంధించి డబ్బులు ఇస్తామన్నారు. కానీ ఇస్తామన్న డబ్బులను ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అధికారులు దీనిపై స్పందించి మాకు న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాం''-స్థానిక ప్రజలు,దివాన్ చెరువు, రాజమహేంద్రవరం