'నాకో ఉద్యోగం ఇప్పించండి' - చక్రాల కుర్చీపై సచివాలయానికి సుజాత
పుట్టుకతోనే పోలియో - చక్రాల కుర్చీకే పరిమితం - అయినా చదువుపై పట్టుదల - ఎంబీఏ పూర్తి - ఉద్యోగం కోసం నేతలకు విజ్ఞప్తులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 17, 2025 at 10:28 AM IST
Disabled Woman Seek Job Help At Secretariat : విధి వెక్కిరించినా వెరవని వనిత. పుట్టుకతోనే పోలియో వచ్చి కాళ్లు కదపలేని స్థితిలో ఉన్నా తండ్రి భుజాలే కాళ్లుగా పాఠశాలకు వెళ్లారు. పేదరికం, వైకల్యం అడుగడుగునా అడ్డుపడినా వెనకడుగు వేయకుండా ఎంబీఏ పూర్తి చేసి నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తోంది సుజాత. ఆత్మవిశ్వాసమే ఆసరాగా ముందుకు సాగుతున్న ఆమె ఉద్యోగ వేటలో ఎక్కని కార్యాలయం మెట్లు లేవు. కలవని నేతలూ లేరు.
తన పరిస్థితి చూసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరుణించి ఓ ఉద్యోగం చూపించకపోతారా అని కొండంత ఆశతో శుక్రవారం అమరావతిలోని సచివాలయానికి వచ్చారు. అక్కడ తల్లిదండ్రులు తోస్తున్న చక్రాల కుర్చీలో వినతిపత్రాలు పట్టుకొని ఆయా కార్యాలయాలకు వెళ్లారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వై.రామచంద్ర రావు, శైలజ దంపతుల కుమార్తె సుజాత (33). పుట్టుకతోనే పోలియో బారినపడటంతో సుజాత నడుము నుంచి కింది భాగం వరకు చచ్చుబడిపోయింది. శరీరం నిల్చోవడానికీ సహకరించదు. ఇంట్లో నేలపై పాకుతూ తన పనులు చేసుకుంటారు. గడప దాటితే మాత్రం తల్లిదండ్రులు తోడు ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆమె తండ్రి రామచంద్ర రావు కుమార్తెలో ధైర్యం నింపారు.
టైలర్ పని చేసుకుంటూ రోజూ ఆమెను పాఠశాలకు ఎత్తుకొని వెళ్లి చదివించారు. ఆర్థిక సమస్యలు ఎదురైనా ఉన్న ఊళ్లోనే ఎంబీఏ వరకు చదివించారు. డిగ్రీలో బీకాం కంప్యూటర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత అయిన సుజాత ఏంబీఏలో మార్కెటింగ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ చేశారు. కంప్యూటర్ కోర్సులూ చేశారు. ఏదైనా ఉద్యోగం వస్తే ఆర్థిక భరోసా ఉంటుందని ప్రజాప్రతినిధులు, అధికారులు అందర్నీ కలిశారు. ఎన్నో కార్యాలయాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. చదువైతే చదివించాం, కానీ ఆమెకు ఓ జీవనాధారం మాత్రం చూపించలేకపోతున్నామని తల్లిదండ్రులు వాపోతున్నారు. దివ్యాంగుల పింఛను కింద నెలకు వచ్చే రూ.6 వేలే ఆసరా అవుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
"నేను చదువుకోలేదు. ఎలాగైనా కుమార్తెను చదివించాలని భుజాలపై మోసుకెళ్లి చదువు చెప్పించాను. కానీ ఆమె భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే భయమేస్తోంది. కుమార్తెకు ఉద్యోగం వస్తే కొంత భరోసా ఉంటుందన్న ఆశతో ఉన్నాం. అందుకే ప్రభుత్వ సాయం కోసం వచ్చాం." -రామచంద్రారావు, సుజాత తండ్రి,
విధిని ఎదిరించి విజేతగా నిలిచిన షేక్ సల్మా
"ఎంత కాలం తల్లిదండ్రులపై ఆధారపడగలను. పింఛన్ కింద రూ.15 వేలు వచ్చేలా చూడాలి. నేను కంప్యూటర్ కోర్సులూ చేశాను. అర్హతలకు తగిన ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేలా ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాలి." -సుజాత,
ఆ అమ్మాయి సంకల్పం - తలవంచిన వైకల్యం - ఏకంగా ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్!

