Digital Lakshmi Scheme to Deliver Services at Doorstep: ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు, వాటికి దరఖాస్తు చేసేందుకు సహాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా డిజి లక్ష్మీలను ప్రవేశపెడుతోంది. సంక్షేమ పథకాలు పొందాలన్నా, దేనికైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్నా పట్టణాల్లో నివసిందే పేదలకు కష్టంగా మారుతోంది.
అదే విధంగా ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ కోసం పోర్టల్‌లో వివరాల అప్‌లోడ్ చేయాలన్నా, ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకునేందుకు లైసెన్సు తీసుకోవాలన్నా, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా డిజిటల్ సేవలు చాలా ముఖ్యం. దీంతో ఈ సేవలను పట్టణాల్లో నివసిందే పేదల ఇళ్ల వద్దకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కొత్తగా ‘డిజి లక్ష్మి’ పేరుతో 10 వేల కియోస్క్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అంటే దాదాపు 10,000 మంది డిజి లక్ష్మీలు అందుబాటులోకి రానున్నారు.
చదువుకున్న వారికి మాత్రమే అవకాశం: అయితే వీరిని స్వయం సహాయక సంఘాల సభ్యుల నుంచి మాత్రమే ఎంపిక చేస్తారు. కనీసం 3 సంవత్సరాలు స్వయం సహాయక సంఘంలో పొదుపు చేసిన మహిళలు, 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు డిజి లక్ష్మీలుగా మారవచ్చు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభంకానున్న ఈ సెంటర్లలో ప్రస్తుతం 20 సేవలు అందనున్నాయి. దశల వారీగా వీటి సంఖ్య మరింతగా పెంచుతారు. ఇవి అందుబాటులోకి వస్తే పట్టణ పేదలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఇంటికి దగ్గరలోనే అనేక సేవలు పొందవచ్చు.
ఈ సేవలన్నీ అందించేందుకు స్వయం సహాయక సంఘాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు, కంప్యూటర్ నైపుణ్యం ఉన్న వారిని గుర్తిస్తున్నారు. ఎంపికైన మహిళలకు 2 లక్షల రూపాయల రుణం ఇస్తారు. ఈ డబ్బులతో వారు కంప్యూటర్, అవసరమైన ఇతర డివైస్‌లు కొనుగోలు చేసుకోవచ్చు. మిగిలిన డబ్బులతో ఈ సేవలు అన్నీ అందించే చోటే ఏదైనా వ్యాపారం కూడా నిర్వహించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
మీ-సేవా కేంద్రాల్లో లభించే అన్ని సేవలు ఇక్కడ లభిస్తాయి: మీ-సేవ సెంటర్లలో అందించే వివిధ రకాల డిజిటల్ సేవలను కొత్తగా అందుబాటులోకి రానున్న డిజి లక్ష్మీలు చేసి పెడతారు. అంతేకాకుండా బస్సు, రైలు టికెట్ల రిజర్వేషన్ కూడా వీరు చేస్తారు. ఇందులో భాగంగా ఎంపికైన మహిళలకు కామన్ సర్వీసు సెంటర్లను మంజూరు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 10,000 సెంటర్లు: స్వయం సహాయక సంఘాల్లో డిగ్రీ చదివిన వారికి ఉపాధితో పాటు ప్రజలకు డిజిటల్ సేవలు అందించే ఉద్దేశంతో డిజి లక్ష్మి కార్యక్రమాన్ని మెప్మా (Mission for Elimination of Poverty in Municipal Areas) రూపొందించింది. ఇందులోభాగంగా 300 పేద కుటుంబాలకు ఒక మహిళ డిజిటల్ సేవలను అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,000 సెంటర్ల ఏర్పాటు లక్ష్యంకాగా, తొలి దశలో 4,000 ప్రారంభించనున్నారు. అంటే 4,000 మంది మహిళలను ఎంపిక చేయనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, కడప నగరాల్లో వీటిని స్టార్ట్ చేయనున్నారు.