Keerthana Inspirational Story : అంగవైకల్యంతో అవస్థలు. ఆర్థిక సమస్యలు. అడుగడుగునా అవమానాలు. ఎన్నో అడ్డంకులు, మరెన్నో అవరోధాలు ఇవేవీ లెక్కచేయకుండా ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా అక్షర యజ్ఞం చేసిందీ ఆ అమ్మాయి. వైకల్యం వెంటాడుతున్నా విజయం వైపు వడివడిగా అడుగేసింది. ఏపీ ఇంటర్ ఫలితాల్లో 902 మార్కులతో పాటు, ప్రత్యేక అవసరాల పిల్లల విభాగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో షైనింగ్ స్టార్ అవార్డుతోపాటు ప్రశంసలు అందుకుంది.
పల్నాడు జిల్లా రూపెనగుంట్ల గ్రామానికి చెందిన జంగా బ్రహ్మయ్య, విక్టోరియా దంపతుల కుమార్తె కీర్తన. బాల్యంలోనే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. వినికిడి లోపం, కంటి చూపు సమస్యలు తలెత్తాయి. తల్లిదండ్రులు ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిప్పినా ఫలితం లేకుండా పోయింది. చివరకు చెవుడు, చూపు సమస్య ఉన్నా కుమార్తె చదువులో చురుగ్గా ఉండటం గమనించి ఆ దిశగా ప్రోత్సహించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్థానికంగా చదువుకుందీ ఈ అమ్మాయి. చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి చూసి ఉపాధ్యాయులు ప్రత్యేకశ్రద్ధతో ప్రోత్సాహించారు.
మొదట్లో తోటి విద్యార్థులతో కలిసేందుకు ఇబ్బంది పడేది కీర్తన. కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినబడక, కనబడక ఎవ్వరిని అడగలేక లోలోపలే కుమిలిపోయేది. దీంతో చదవాలనే జిజ్ఞాస ఉన్నా సహకారం లేకపోవడంతో మార్కులు కూడా తక్కువగా వచ్చేవి. ఓ వైపు అంగవైకల్యంతో బాధపడుతుంటే మరోవైపు అవమానాలు, అవహేళనలు ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. అయినా వాటికి ఏ మాత్రం తలొగ్గలేదు.
Keerthana Excelled in AP Inter : తల్లిదండ్రులు తన కోసం పడుతున్న కష్టం తనలాంటి వారికి అండగా నిలవాలనే దృఢ సంకల్పంతో మరింత కసిగా చదివింది కీర్తన. రేయింబవళ్లు శ్రమించి 10వ తరగతిలో 442, ఇంటర్‌లో 902 మార్కులు సాధించి ఆశ్చర్యపరిచింది. అంగవైకల్యమని అధైర్యపడకుండా అవరోధాలు అధిగమిస్తూ పుస్తకాలతో కుస్తీ పట్టి విజయం సాధించింది. దేచవరంలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో 6వ తరగతిలో చేరడం అక్కడి ఉపాధ్యాయుల సహకారం అందించడం వల్లే చదువుపై దృష్టి పెట్టానని వివరిస్తోంది కీర్తన.
"వినిపించని పరిస్థితి కాబట్టి ఎవ్వరి దగ్గరికి వెళ్లలేను. ఏదైనా సందేహం ఉంటే టీచర్లను అడిగేదాన్ని. ఇంకా అర్ధం కాకపోతే ఇంటికి వచ్చి ఫోన్లో తెలుసుకొని సందేహాలను నివృత్తి చేసుకున్నాను. అలా 902 మార్కులు సాధించాను. ఇది చూసి మా తల్లిదండ్రులు గర్వపడుతున్నారు." - కీర్తన, దివ్యాంగ విద్యార్థిని
10వ తరగతిలో వచ్చిన మార్కులు ఆత్మవిశ్వాసం పెంచాయని అదే ఉత్సాహంతో ఇంటర్‌లో 902 మార్కులు సాధించినంటోంది. ప్రత్యేక అవసరాల పిల్లల విభాగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు చెబుతోంది. పేదరికం, వైకల్యంతో పాటు అనేక సవాళ్లకు ఎదురీది ఇంటర్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన కీర్తనను విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ ఇటీవలే షైనింగ్ స్టార్ అవార్డుతో సత్కరించారు. మంత్రిని కలిసిన సమయంలో ఎంతో ధైర్యంగా మాట్లాడిన ఆమె తనకు సాయం అందిస్తే భవిష్యత్‌లో ఐఏఎస్ సాధించి తనలాంటి వారికి బాసటగా నిలుస్తానని చెప్పింది. ఈమె మనోధైర్యాన్ని మెచ్చుకున్న మంత్రి ఉన్నత విద్యకు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చి ల్యాప్ టాప్ బహుమతిగా ఇచ్చారు.
వైకల్య సమస్యలతో పోరాడుతూనే కుమార్తె కష్టపడి చదివిందని కీర్తన తల్లిదండ్రులు చెబుతున్నారు. అమ్మాయిని చదివించాలని ఆశగా ఉన్నా ఆర్థిక పరిస్థితి అందుకు తగినట్లుగా లేదంటున్నారు. దాతలెవరైనా కీర్తన చదువుకునేందుకు ప్రోత్సహించాలని కోరుతున్నారు. అన్ని సరిగ్గా ఉన్నా ఏదో ఒక సాకు చెప్పి చదువును పక్కనపెట్టే ఈ రోజుల్లో అంగవైకల్యం ఉన్నప్పటికి ఆత్మవిశ్వాసంతో చదువుకుందని దేచవరం ఏపీ మోడల్ స్కూల్ అధ్యాపకులు చెబుతున్నారు.
సివిల్స్ సాధించడమే లక్ష్యం : తనలాంటి వారితో పాటు సాధారణ విద్యార్థులకూ కీర్తన స్పూర్తిగా నిలుస్తోందని అధ్యాపకులు అంటున్నారు. సమస్యలతో సతమతం అవ్వకుండా లక్ష్యసాధన వైపు అడుగేసింది కీర్తన. కాలి వేలు బాగలేక పోయినా కుంగిపోయే ఈ రోజుల్లో కంటిచూపు, వినికిడి సమస్యలతోనే చదివి పరీక్షల్లో విజయం సాధించింది. భవిష్యత్‌లో సివిల్స్ సాధించడమే లక్ష్యమంటోందీ సరస్వతీ పుత్రిక.
'బామ్మ మాట బంగారు బాట' - నానమ్మ చెప్పిన మాటలు విని సివిల్స్‌లో 797 ర్యాంకు
తొలిప్రయత్నంలో విఫలమైనా - పట్టుదలతో చదివా : పవన్‌కుమార్ రెడ్డి