సెలబ్రిటీ నుంచి వీడియో కాల్ వచ్చిందా? - ఇవి చెక్ చేసుకున్నాకే నమ్మండి
ఏఐ సాంకేతికతను ఉపయోగించి రెచ్చిపోతున్న సైబర్ మాయగాళ్లు - నకిలీ ఏఐ వీడియోలతో బురిడీ కొట్టిస్తున్న వైనం - అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయొద్దంటున్న పోలీసులు

Published : October 12, 2025 at 4:17 PM IST
Beware of AI Related Cyber Crimes : ఇంటర్నెట్ యుగంలో మానవ జీవనశైలి చాలా వేగంగా మారుతోంది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అద్భుతాలను సృష్టిస్తోంది. అదే సాంకేతికత సైబర్ మోసగాళ్ల చేతిలో ప్రమాదకరమైన ఆయుధంగానూ మారింది. ఈ మోసాలు కొత్త పుంతలు తొక్కుతూ యావత్ ప్రపంచానికే సవాల్ విసురుతున్నాయి. ఏఐ వల్ల ఏది నిజమో? అబద్ధమో? తెలియని గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆందోళన కలిగించక మానదు. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మచ్చుకు కొన్ని సంఘటనలు :
- ఖమ్మంలోని ఓ వ్యాపారికి ప్రముఖ నటుడి పేరిట ఇటీవల వీడియోకాల్ చేసిన సైబర్ కేటుగాళ్లు అతడి నుంచి రూ.2లక్షలు దండుకున్నారు. మోసపోయినట్లుగా తెలుసుకున్న సదరు వ్యాపారి లబోదిబోమనాల్సి వచ్చింది.
- సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌చేసి తాను మాజీ మంత్రి దేవినేని ఉమా పీఏనని నమ్మబలికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వీడియోకాల్ మాట్లాడినట్లుగా ఏఐ టూల్స్ ద్వారా సృష్టించాడు. అనంతరం పేద కార్యకర్తల పిల్లల చదువుకు ఆర్థికసాయం పేరిట వారి నుంచి రూ.35వేలను కాజేశాడు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టింది.
డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ వాయిస్ కాల్స్‌తో : తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ) ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు, వీడియోకాల్స్, నకిలీ వాయిస్ కాల్స్, ఆటోమేటెడ్ చాట్‌బాట్స్ ద్వారా సైబర్ మాయగాళ్లు ప్రజలను క్షణాల్లో మోసగిస్తున్నారు. మరికొందరు మోసగాళ్లు ఏఐ టూల్స్ సాయంతో ప్రముఖులు, సినీనటులు, ప్రభుత్వాధికారులు, బ్యాంకు మేనేజర్ల వాయిస్‌లు, వీడియోలతో జనాలను మభ్యపెట్టి బురిడీ కొట్టిస్తున్నారు. వారు ప్రజల భావోద్వేగాలనూ లక్ష్యంగా చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒక ఫోన్‌కాల్ లేదా వీడియోకాల్ నిజమా? కాదా? అని నిర్ధారించుకోవటం ఈ రోజుల్లో కష్టమవుతోంది. డీప్ ఫేక్ టెక్నాలజీ కారణంగా పెనుసవాల్‌గా మారింది. ప్రధానంగా ఉద్యోగాలు, ఆన్‌లైన్ షాపింగ్, ఇన్వెస్ట్మెంట్, లాటరీ పేర్లతోనూ మోసగించే కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఇవి పాటించాల్సిందే : టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతేవేగంగా ప్రజల్లోనూ అవగాహన పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. కృత్రిమ మేధ ఆధారిత సైబర్ మోసాల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో పంచుకునే వ్యక్తిగత వివరాలు, అనుమానాస్పద లింకులు, కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఆడియోలు, వీడియోలు నకిలీవా? కాదా? అని తేల్చుకోకుండా నమ్మకూడదు. మోసపోతే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1930కు సంప్రదించి ఫిర్యాదు చేయాలి. ఇటీవల కాలంలో ఆఫర్ల పేరుతో ఆన్లైన్లో పలు మోసాలు జరుగుతున్నాయి. వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలి. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లపై క్లిక్ చేయకపోవడమే మంచిది.
"ఏఐ(కృత్రిమ మేధ) ఆధారిత సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలి. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్‌ను ఓపెన్ చేయవద్దు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు"- ఎ.రఘు, కల్లూరు ఏసీపీ
ఆ నంబర్స్ నుంచి కాల్ వస్తే తప్పకుండా కేటుగాళ్లే - 'రిక్విన్'తో సైబర్ నేరాలకు చెక్!
వాట్సాప్ వీడియో కాల్లో స్క్రీన్ షేర్ చేస్తున్నారా? - జాగ్రత్త సైబర్ నేరానికి బలవుతారు!

