Details Of Cabinet Decisions on Kaleshwaram : కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి పునరాకృతి, మంత్రివర్గ ఉపసంఘం, మంత్రివర్గం నిర్ణయాల వివరాలను ఈ నెల 30లోగా అందజేస్తామని సీఎంవో జస్టిస్ ఘోష్ కమిషన్‌కు లేఖ రాసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావులు నిర్ణయాలన్నీ మంత్రివర్గ ఆమోదంతో తీసుకొన్నట్లు కమిషన్ ఎదుట చెప్పడంతో, వాటిని నిర్ధారించుకునేందుకు కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వులు జారీచేసిన సమయానికి మంత్రివర్గ ఆమోదం ఉందా లేదా అన్న వివరాలను నీటిపారుదల శాఖ నుంచి తీసుకుంటున్నారు.
దానికోసం ఉపసంఘం నియామకం : ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా ఎల్లంపల్లి నుంచి నీటిని మళ్లించే పనులకు టెండరు పిలవగా, పునరాకృతి తర్వాత కాలువల సామర్థ్యం పెరగడంతో పనులను గుత్తేదారులకు ఎలా అప్పగించాలన్న దానిపై ముగ్గురు మంత్రులతో ఉపసంఘాన్ని అప్పటి ప్రభుత్వం నియమించింది. ఉప సంఘం ప్యాకేజీల వారీగా వివరాలు సేకరించారు. మొదట చేపట్టిన పనితో కలిసిపోయి ఉండి విడతీయడానికి వీలుకాకపోతే అప్పటికే ఉన్న గుత్తేదారుకు ఇవ్వాలని సూచించింది. ప్రత్యేకంగా టెండర్ పిలవడానికి అవకాశం ఉన్నవాటికి టెండరు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది.
ప్రతి ప్యాకేజీలో ఈ వివరాలు స్పష్టంగా పేర్కొంటూ నివేదిక ఇచ్చింది. ట్రాన్స్‌పరెన్సీ ప్రైస్ డిస్కవరీ, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో టెండర్ ప్రక్రియకు సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఉదాహరణకు 14వ ప్యాకేజీలో కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంతో పాటు అప్రోచ్ ఛానల్, కాలువ, సొరంగం, పంపుహౌస్ ఉన్నాయి. వీటి సామర్థ్యం పెరిగిన పంపుహౌస్‌లో సగం పని ఒకరు, మిగితాది పూర్తి చేయడానికి మరొకరికి వీలుకాదు అని భావించి, ఉన్న గుత్తేదారుకే 2015-16 ధరలతో ఇవ్వాలని సిఫార్సు చేసింది.
ఉప సంఘం నివేదికను మంత్రివర్గంలో ఆమోదం : కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యం మొదట ఒక టీఎంసీ కాగా ఏడు టీఎంసీలకు (తదుపరి 15 టీఎంసీలకు) పెంచారు. అదనపు ఆయకట్టు ఉన్నందున ఈ పనికి టెండరు పిలవడం లేదా ట్రాన్స్‌పరెన్సీ ప్రైస్ డిస్కవరీ పద్ధతిని అనుసరించాలని సూచించింది. కొన్ని పనులకు స్విస్ ఛాలెంజ్ పద్ధతిని సూచించినట్లు తెలిసింది. ఉప సంఘం నివేదికను మంత్రివర్గంలో ఆమోదించినట్లు తెలిసింది. 21వ ప్యాకేజీ పనిని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో పిలవగా ఆర్థిక శాఖ దీనిని తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఈ పద్ధతికి స్వస్తిపలుకుతూ నీటిపారుదల శాఖ మెమో జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెండర్ ప్రక్రియ మంత్రివర్గం ఆమోదం ప్రకారమే జరిగిందా లేక భిన్నంగా జరిగిందా అనేది పరిశీలించి కమిషన్‌కు నివేదించనున్నట్లు తెలిసింది.
కాళేశ్వరంలోని మరో ప్యాకేజీపై విజి‘లెన్స్’ - అనంతగిరి రిజర్వాయర్ వివరాలపై ఈఈకి లేఖ
'కాళేశ్వరం' నివేదికలపై కదలిక - చర్యలకు సిద్ధమవుతున్న సర్కార్