Pawan Kalyan Alluri district Tour : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండో రోజు పర్యటించనున్నారు. అరకులోని డుంబ్రిగూడ మండలం కురుడి గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. అలాగే సుంకరమెట్ట కాఫీతోటల వద్ద నిర్మించిన చెక్క వంతెనను ప్రారంభించనున్నారు.
కాళ్లు, చేతులకు గాయాలు : అయితే సింగపూర్‌లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. మంటలు చెలరేగడంతో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కుమారుడి ప్రమాద వార్తను అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు అధికారులు తెలియజేశారు. తన పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్లాలని నేతలు, అధికారులు సూచించారు.
ముమ్మర ఏర్పాట్లు : అయితే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసిన తర్వాతే సింగపూర్ వెళ్తానని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ అరకులోని కురిడిని సందర్శించి అక్కడి గ్రామస్థుల సమస్యలను తెలుసుకుంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మన్యం పర్యటన ముగిశాక పవన్‌కల్యాణ్ సింగపూర్ వెళ్లేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆస్పత్రిలో చికిత్స : సింగపూర్‌లోని రివర్ వ్యాలీ షాప్‌హౌస్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించిది. ఈ ఘటనలో 15 మంది చిన్నారులు సహా 19 మందికి గాయాలయ్యాయి. సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో సహాయచర్యలు చేపట్టారు. గాయపడిన చిన్నారులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సింగపూర్ షాప్‌హౌస్‌లోని రెండు, మూడు అంతస్తుల్లో స్కూల్ నిర్వహిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలోనే పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు.
సీఎం ఆరా: పవన్‌కల్యాణ్ కుమారుడికి గాయాలైన విషయం ఆందోళన కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సింగపూర్ అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడికి గాయాలు కావడం బాధాకరమన్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని సీఎం తెలిపారు.