Deputy CM Pawan Kalyan visit to Dumbriguda Village: అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుంది, నీడనిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడలో 'అడవితల్లి బాట' కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డుంబ్రిగుడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని సీఎం చంద్రబాబును కోరితే 24 గంటల్లో రూ.49 కోట్లు మంజూరు చేశారని అన్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని పవన్ అన్నారు.
అడవి, ప్రకృతిపై నాకు అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయని పవన్ తెలిపారు. అరకు అద్భుతమైన ప్రాంతమని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని తెలిపారు. అలానే మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని గిరిజన ప్రజల జీవనశైలి మెరుగుపరచాలని అన్నారు. అలానే మన్యం ప్రాంతాల్లో రోడ్లు బాగుండాలని గత ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్లకు రూ.92 కోట్లే ఖర్చు చేసిందని వివరించారు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగాలి: కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోపే రూ.1,005 కోట్ల విలువైన పనులను మంజూరు చేశామని పవన్ తెలిపారు. రోడ్ల నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచామని పవన్ కల్యాణ్ తెలిపారు. వాటికి వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మన్యం ప్రాంతంలో కూటమి పార్టీలకు ఓట్లు పడకపోయినా, ఇక్కడి ప్రజల బాగోగులు చూడటానికి తాము ఉన్నామని పవన్ తెలిపారు. ప్రభుత్వాలు, పార్టీలు మారుతుంటాయని కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగాలని అని పవన్ కల్యాణ్ అన్నారు.
అంతకుముందు పెదపాడు గ్రామంలో గిరిజనులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. చాపురాయి ప్రాంతాన్ని దాటుకుంటూ గిరిశిఖర గ్రామానికి ఆయన వెళ్లి అక్కడి ప్రజలతో సుమారు గంటసేపు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని వారికి పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.
‘సారీ గాయ్స్ - హెల్ప్ చేయలేకపోతున్నా’ - మంత్రి నారా లోకేశ్ పోస్ట్