Pawan Kalyan Letters to CS and DGP about Terrorists: జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు, వారి సానుభూతిపరుల జాడలపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి లేఖలు రాశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విజయనగరంలో ఓ యువకుడు పేలుళ్లకు కుట్ర పన్నిన విషయాన్ని గుర్తించి పోలీసులు అరెస్టు చేసిన విషయం లేఖలో ప్రస్తావించారు. ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారులు, రోహింగ్యాల కదలికలపైనా అధికారులు అప్రమత్తమై, ఎక్కడైనా ఉగ్ర జాడలు కనిపిస్తే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్రంలో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉందన్న పవన్ తీర ప్రాంత నిఘా, రక్షణపై ప్రత్యేక దృష్టి అవసరమని తెలిపారు. పహల్గాం ఉగ్ర దాడులు, తదనంతర పరిణామాలతో దేశ అంతర్గత భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకునే విషయంలో ఎక్కడా ఉదాసీనత వద్దని సూచించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, మన్యం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. గతంలో ఏవైనా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై పూర్తి స్థాయి అప్రమత్తత అవసరమని స్లీపర్ సెల్స్, తీవ్రవాద సానుభూతిపరుల ఉనికిని గుర్తించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
రోహింగ్యాల ఉనికిపై సమగ్ర దర్యాప్తు: అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని తెలిపారు. గుంటూరుతోపాటు మరికొన్ని జిల్లాల్లో రోహింగ్యాల ఉనికిపై సమగ్ర దర్యాప్తు జరపాలని వీరిలో కొందరికి రేషన్, ఆధార్, ఓటర్ కార్డులు ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనుమానితుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వంటి పత్రాలు ప్రభుత్వ శాఖల నుంచి ఎలా పొందారు, వారికి ఆశ్రయం ఎవరు ఇచ్చారు, వారికి సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించి లోతైన విచారణ చేపట్టాలన్నారు.
గతంలో గుంటూరుతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్న విషయం ప్రస్తావించారు. దేశ భద్రత, రక్షణ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నవని పోలీసు యంత్రాంగం శాంతిభద్రతలతోపాటు అంతర్గత భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి కేంద్రానికి సహకరించాలన్నారు. కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంపై గతేడాది నవంబర్ నెలలో పరిశీలనకు వెళ్లిన సందర్భంలోనూ దేశ అంతర్గత భద్రతను ప్రస్తావించిన విషయం పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.
వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం: పవన్ కల్యాణ్
విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ - పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్