Bhatti Vikramarka on Budget 2025 : మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా అప్పులు తెచ్చిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొత్తం రూ.16.70లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఆ మొత్తంతో ఏం నిర్మించారని ప్రశ్నించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసన సభలో ప్రసంగించిన ఆయన గత ప్రభుత్వ పాలనా తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
స్వయంగా కాగ్ వెల్లడించింది : రూ.16.70లక్షల కోట్లతో నాగార్జున సాగర్ నిర్మించారా? ఎస్‌ఆర్‌ఎస్పీ నిర్మించారా? ఓఆర్‌ఆర్ నిర్మించారా? ఎయిర్‌పోర్టు నిర్మించారా? అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాళేశ్వరానికి మాత్రమే రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని, అదీ కూలిపోయిందని అన్నారు. సింగరేణికి రూ.77 వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారని, పది సంవత్సరాల్లో ఏ గ్రామంలోనైనా రెండు పడకగదుల ఇళ్లు నిర్మించారా? అని నిలదీశారు. అసెంబ్లీ ఆమోదం లేకుండా రూ.2.30లక్షల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని స్వయంగా కాగ్ వెల్లడించిందని తెలిపారు.
ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు : గత ప్రభుత్వం ఏనాడూ నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదని, భారీగా బడ్జెట్ పెట్టినా నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదని భట్టి ఆరోపించారు. 2016-17లో రూ.8వేల కోట్లు, 2018-19లో రూ.40వేల కోట్లు, 2021-22లో రూ.48వేల కోట్లు, 2022-23లో రూ.52వేల కోట్లకు పైగా, 2023-24లో రూ.58,571 కోట్లు ఖర్చు చేయలేదని, ఓఆర్‌ఆర్‌ను రూ.7వేల కోట్లకే 30 సంవత్సరాల కాలానికి అమ్ముకున్నారని, దొడ్డిదారిన ఓఆర్‌ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకున్నారని విమర్శించారు. తరువాత వచ్చే ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయాన్ని కూడా ముందే తీసుకున్నారని, కేసీఆర్ నెరవేర్చని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రైతు భరోసా కోసం ఈ బడ్జెట్‌లో రూ.18 వేల కోట్లు కేటాయించామని, ఆరు గ్యారంటీలకే రూ.56.80 వేల కోట్లు కేటాయించామని భట్టి గుర్తు చేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా గ్రూప్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, పేపర్లు లీక్ కాకుండా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను నిర్వహించామని తెలిపారు. ఉద్యోగాలు భర్తీ చేయడంతో స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నామని, స్వయం ఉపాధి పథకాల కోసమే రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు అప్పులు మాత్రమే చేసిందని, గత ప్రభుత్వం చేసిన అప్పులకే ఏడాది కాలంలో రూ.1.59 లక్షల కోట్లు చెల్లించామని, కొత్తగా చేసిన అప్పుల్లో కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం వాడుకున్నదని, మిగతా డబ్బంతా బీఆర్‌ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లింపులకే సరిపోయిందని వివరించారు.
రుణాలు మాఫీ చేశాం : బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రుణమాఫీని పూర్తి చేయలేదని, పదేళ్లలో చేసిన రుణమాఫీ రూ.28,053 మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే రూ.27 వేల కోట్లు రుణాలు మాఫీ చేశామని తెలిపారు.
"శాసనసభ ఆమోదం లేకుండా రూ.2.30 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కాగ్ వెల్లడించింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా అప్పులు తెచ్చారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొత్తం రూ.16.70 లక్షల కోట్లు ఖర్చు చేసింది. రూ.16.70 లక్షల కోట్లు ఖర్చు చేసిన బీఆర్‌ఎస్ ఏమి నిర్మించింది?" - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
Telangana Budget 2025 : రూ.3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ - ఏ శాఖకు ఎంత కేటాయించారంటే!
బడ్జెట్ 2025 : ఆరు గ్యారంటీలకు భారీగా కేటాయింపులు - ఎంతంటే?