Demand For Home Theater Increasing : సీట్లపై కాళ్లు పెట్టకూడదు. ఫొటోలు, వీడియోలు నిషేధం. ఇలాంటి నిబంధనలు ఏవీలేవు. ఎలా కావాలంటే అలా ఇష్టమైన రీతిలో సినిమాలను ఆస్వాదించవచ్చు. ఇంట్లోనే కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమాలు చూసేలా ప్రత్యేకంగా మినీ థియేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. పెద్ద నగరాల్లో ఉన్న హోం థియేటర్ సంస్కృతి ప్రస్తుతం గ్రామాల్లోకీ వచ్చింది. కాస్త ఆర్థిక పరిపుష్టి గల వారు లగ్జరీ లైఫ్‌ను ఇష్టపడుతున్నారు. రెండు, మూడు తరాలు ఒకే చోట చేరి, వయో భేదం లేకుండా ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపేస్తున్నారు. వీరిలో శేష జీవితాన్ని సరదాగా గడిపేవారు కొందరైతే, ఉరుకులు పరుగుల జీవితంలో నిత్యం టెన్షన్‌గా గడిపేవారు ఇంకొందరు.
బయటకు వెళ్లకుండానే ఇంట్లోనే : నగరాల్లోనే కాదు, ఉమ్మడి జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్గొండ వంటి పట్టణాలు, మేళ్లచెరువు వంటి పల్లెల్లో సైతం నూతన ఇళ్ల నిర్మాణంలో కొత్తగా హోమ్ థియేటరు ప్లాన్ ఒకటుంటోంది. ఈ సరదా కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ఔత్సాహికులు వెనకాడటం లేదు. ఎంత సంపాదించినా, సంతోషంగా ఈ మాత్రం అనుభవించేందుకు అదృష్టం ఉండాలి కదా! అంటున్నారు వీళ్లంతా. ఈ నేపథ్యంలో ఇటీవల వీటి సంఖ్య పదుల్లోకి చేరుతోంది. ఒక్కొక్కరు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. వేసవికాలం, పండగల సీజన్‌లలో పిల్లాపాపలతో ఎంజాయ్ చేసేందుకు బయటకు వెళ్లకుండానే ఇంట్లోనే సినిమాలు చూస్తూ కాలం గడిపేస్తున్నారు.
ఇప్పుడు అలా కాదు : గతంలో ఇల్లు నిర్మించుకునేటప్పుడు పిల్లలకు స్టడీ రూం, దేవుడి గది అని ప్రత్యేకంగా కేటాయించేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. అవేవీ లేకపోయినా వినోదానికి ఓ గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆర్కిటెక్ట్‌లతో హోమ్ స్క్రీన్లలకు సొబగులు దిద్దుకుంటున్నారు. పెద్ద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లపై హోం థియేటర్, సౌండ్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చిన తరువాత ఈ సంఖ్య పెరిగింది.
"మా ఇంట్లో అమ్మానాన్న, తాత, మేము, పిల్లల కోసం మినీ థియేటర్ నిర్మించాను. మాకు గతంలో సినిమా థియేటర్ ఉండేది. ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. పండగలు, వేసవిలో సరదా కోసం ఎటూ వెళ్లాల్సిన అవసరం లేకుండా మా ఇంట్లోనే సినిమాలు చూస్తాం. ఇక్కడి మినీ థియేటరుకు మేం రూ.10 లక్షలు వెచ్చించాం. పెద్ద తెర, ప్రొజెక్టరు, థియేటరులో లాగా శబ్దాలు ఇంపుగా విన్పించే ఖరీదైన స్పీకర్లు, సౌండ్ ఫ్రూఫ్ సీలింగ్, సోఫాలు, లైట్లు, బ్రాడ్‌బాండ్ కనెక్షన్ సహా ఇతరత్రా అన్నీ లోపల ఉంటాయి." -కర్నాటి ప్రవీణ్‌రెడ్డి, మేళ్లచెరువు
ఇంట్లోనే 'థియేటర్ ఎక్స్పీరియన్స్'! - సామాన్య ప్రజలకూ అందుబాటులో ధరలో!!