Dangling Cables A Threat To Residents : హైదరాబాద్ మహానగరంలో ఏ కాలనీలో చూసినా విద్యుత్ స్తంభాలకు భయంకరంగా వేలాడుతున్న కేబుళ్లు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. వాటిని తమ అవసరాల నిమిత్తం కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఏర్పాటు చేసి తర్వాత వాటి నిర్వహణ గాలికొదిలేస్తున్నారు. దీంతో అవి గాల్లో వేలాడుతూ ప్రజలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి.
ద్విచక్ర వాహనదారులు వీటివల్ల ప్రమాదాల బారిన పడ్డ ఘటనలు చాలానే ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చాలాకాలంగా అస్తవ్యస్థంగా ఉన్న కేబుళ్లను తొలగించాలని నగరవాసుల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ వాటిని విద్యుత్ శాఖ పెద్దగా పట్టించుకోలేదనే వాదనలు ఉన్నాయి. ఇదే అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి విద్యుత్ శాఖపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఆ శాఖ అధికారులు వేలాడే కేబుళ్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టిసారించారు.
ప్రాణాంతకరంగా పరిణమిస్తున్న కేబుల్ వైర్లు : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తమ విద్యుత్ స్తంభాలపై అడ్డదిడ్డంగా, సాధారణ ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించిన కేబుల్స్‌ను తొలగించాలని కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. గతంలో పలుమార్లు కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లతో సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో 28 కంపెనీలకు చెందిన కేబుళ్లు, ఇంటర్ నెట్ ప్రొవైడర్లతో చర్చించారు. ఈ తొలగింపు ప్రక్రియలో కచ్చితంగా మమేకమై ప్రభుత్వానికి సహకరిస్తామని అసోసియేషన్ సభ్యులు విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం : విద్యుత్ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే లైన్‌మెన్‌లు, హెల్పర్లు స్తంభాలు ఎక్కేందుకు ప్రయత్నిస్తే అసలు సాధ్యం కాని విధంగా తీగలు వేలాడుతూ ఉన్నాయి. దీంతో విద్యుత్ పునరుద్దరణ పనులకు సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందువల్ల కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్ల విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ స్పష్టం చేశారు. వారి అభిప్రాయం మేరకు తదుపరి కార్యాచరణ తెలియజేస్తామని వివరించారు.