Daily Labour Loss Life in Anakapalle Fire Accident: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం నుంచి ఉపాధి కోసం కుటుంబంతోపాటు అనకాపల్లి జిల్లాకు వలస వెళ్లారు. 15 రోజుల క్రితం కొత్త అమావాస్య పండగకు సొంత గ్రామానికి వచ్చి వెళ్లారు. గ్రామానికి చెందిన నిర్మల (38) అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో ఆదివారం బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో మృతి చెందింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
గొడత వీరవెంకట సత్యనారాయణ, అతని భార్య నిర్మల, అయిదేళ్ల కూతురు ప్రవల్లికతో కలిసి కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఏడాదిగా పని చేస్తున్నారు. నిర్మల మృతితో బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఇదే ఘటనలో సామర్లకోట పెన్షన్‌లైన్‌కు చెందిన వేలంగి రాజు అతని భార్య సంతోషి గాయపడ్డారు. వీరి కుమార్తె షారోన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలియగానే బాధితుల బంధువులు అక్కడికి తరలివెళ్లారు.
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆరు మృతదేహాలకు ఆదివారం రాత్రి పోస్టుమార్టం పూర్తయింది. అనకాపల్లి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి శాంతిప్రభ, డీపీఎంవో డాక్టర్ ప్రశాంతి, డిప్యూటీ డీఎంహెచ్‌వో వీరజ్యోతి పర్యవేక్షించారు. భీమిలికి చెందిన హేమంత్ (20), సామర్లకోట వేట్లపాలేనికి చెందిన నిర్మల మృతదేహాలకు అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
కూలి డబ్బులిస్తారనే వేచి ఉన్నాం:
కుటుంబంతో బాణసంచా తయారీ కేంద్రం వద్దే ఓ గదిలో ఉంటున్నాం. ప్రతి ఆదివారం కూలి డబ్బులు తీసుకుంటుంటాం. డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చేశారు. ముందే ఇచ్చి ఉంటే డబ్బులు తీసుకుని సరకులు కొనుక్కోవడానికి బయటకు వచ్చేవాళ్లం. ప్రమాదంలో చిక్కుకుని ఉండేవారం కాదు. నా భార్య, కూతురు గదిలో ఉండటంతో గాయపడ్డారు. -వేలంగి రాజు, సామర్లకోట, క్షతగాత్రుడు
ప్రమాదానికి కారణం ఏంటి?: ఇదిలావుంటే భారీ విస్ఫోటం వెనక కారణం ఏమై ఉంటుందని నిపుణులు శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు. మృతదేహాలను ఘటనా స్థలం నుంచి తరలించాక ఫోరెన్సిక్, అనకాపల్లి, నర్సీపట్నం సబ్‌డివిజన్‌కు చెందిన క్లూస్ టీంలు భౌతిక సాక్ష్యాధారాలను సేకరించాయి. చీకటి పడినప్పటికీ టార్చ్‌లైట్ల వెలుతురులో 20కి పైగా నమూనాలు తీసుకున్నారు. అందులో పొటాషియం, సల్ఫర్‌తో పాటు బాంబుల తయారీకి వాడే మందుగుండు సామగ్రి, ఇతర ముడిపదార్థాలను గుర్తించారు. ఘటనా స్థలంలో మొత్తం 8 షెడ్లు ఉండగా, వాటిలో మూడింట బాణసంచా తయారు చేస్తున్నారు. రెండు షెడ్లు స్టాకు పాయింట్లు. మిగిలినవి కార్మికుల అవసరాలకు ఉంచారు. ఈ షెడ్లన్నీ దెబ్బతిన్నాయి.
కొనసాగుతున్న చికిత్స: అనకాపల్లి జిల్లా బాణసంచా ప్రమాద క్షతగాత్రులకు కేజీహెచ్‌లో చికిత్స కొనసాగుతోంది. గాయపడిన 8 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నర్సీపట్నం ఆస్పత్రిలో ఇద్దరికి, విశాఖ కేజీహెచ్‌లో నలుగురికి చికిత్స కొనసాగుతోంది. ఇద్దరి పరిస్థితి విషమించడంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రిలో 6 మృతదేహాలకు, అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
ప్రమాదఘటనాస్థంలో ఇంకా ఏమైనా బాణసంచా సామగ్రి మిగిలిపోయిందేమోనని పరిశీలిస్తున్నారు. అక్కడక్కడ చిన్నగా వస్తున్న పొగలను సిబ్బంది ఆర్పుతోంది. మిగిలిపోయిన బాణసంచాను భూమిలో పాతిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి