ETV Bharat / state

నానో బనానా ట్రెండ్​ను మీరూ ఫాలో అవుతున్నారా? - దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా నానో బనానా ట్రెండ్ - నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లను విస్తృతంగా ప్రచారం చేస్తూ డబ్బు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు - జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు

Nano Banana Prompt Scam Telugu
Nano Banana Prompt Scam Telugu (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : September 17, 2025 at 8:50 PM IST

3 Min Read
Choose ETV Bharat

Nano Banana Prompt Scam Telugu : 'గూగుల్ జెమిని నానో బనానా' ట్రెండ్​​ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్​ అవుతోంది. కృత్రిమ మేధ సాంకేతికతతో పనిచేసే ఈ ఫొటో ఎడిటింగ్ టూల్​ను ప్రస్తుతం ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ అందరూ వినియోగించుకుంటున్నారు. దీనిలో ఫొటో అప్​లోడ్ చేసి దానిని ఏ విధంగా మార్చాలి అనుకుంటున్నామో దానికి అర్థమయ్యే రీతిలో ప్రాంప్ట్ ఇస్తే మనం అనుకున్న రీతిలో మనకు దానిని ఎడిట్ చేసి ఇస్తుంది. దీనితో పాటు మన ఫొటోలను త్రీడీ బొమ్మలుగా కూడా మార్చుకునే వెసులుబాటును కల్పిస్తుంది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ : దీనితో ఎడిట్ చేసిన ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే సైబర్​ నేరగాళ్లు రోజుకో కొత్త వేషంలో మోసాలకు పాల్పడుతూ బురిడీ కొట్టిస్తున్నారు. కాగా వైరల్​గా మారిన ఈ ట్రెండ్​ వారికి ఓ వరంలా మారింది. నానో బనానా పేరుతో నకిలీ వెబ్​సైట్లు, మొబైల్ యాప్​లను తయూరు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారు.

తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓ వ్యక్తికి సోషల్​ మీడియాలో నానో బనానా ట్రెండ్​కు సంబంధించిన ఒక పోస్టు కనిపించింది. దానిలోకి వెళ్లి ఓ లింకును క్లిక్​ చేశాడు. దీంతో అతని బ్యాంకు ఖాతాలోని రూ. 70 వేలు మాయమయ్యాయి. ఇదే మాదిరిగా హైదరాబాద్​లోనూ మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Nano Banana Prompt Scam (Eenadu)

గూగూల్​లో వెతికే సందర్భంలో : ఆయా యాప్​లు లేక సమాచారం కోసం వ్యక్తులు గూగుల్​లో (ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ నుంచి) వెతకడం సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తోంది. గూగూల్​లో వెతికే సందర్భంలో వారి నకిలీ సైట్లు తెరపైకి వస్తున్నాయి. అనంతరం వాటిని క్లిక్ చేస్తే యాప్​ను డౌన్​లోడ్ చేసుకోమని సూచిస్తాయి. లేదంటే లింకులు (ఏపీకే ఫైళ్లు) పంపిస్తాయి. వాటిమీద క్లిక్ చేస్తే ఎనీడెస్క్ యాప్​లు డౌన్​లోడ్​ అవుతాయి.

దీంతో ఫోన్​ మనదగ్గరే ఉంటుంది. కానీ సుదూర ప్రాంతాల్లో ఉండే నేరగాళ్లు మన ఫోన్​ను ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. దీంతో ఫోన్​లోని బ్యాంకింగ్​, యూపీఐ యాప్​ల సమాచారాన్ని సేకరించి నగదు కాజేస్తుంటారు. మన ఫోన్​లో​ ఉండే సమాచారాన్ని, గ్యాలరీలో ఉండే ఫొటోలను సేకరిస్తారు. వాటిని ఆధారంగా చేసుకుని మన ఫొటోలను అసభ్యకరంగా మనకు పంపించి బ్లాక్​మెయిల్ చేస్తారు. మన నుంచి డబ్బులు డిమాండ్ చేస్తారు.

జాగ్రత్తలు పాటించండి : ఫొటోల ఎడిటింగ్, ప్రాంప్ట్ కోసం ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ యాప్​లను ఆశ్రయించకూడదు. గూగుల్ ప్లేస్టోర్, ఐస్టోర్​లోని యాప్​లను మాత్రమే వినియోగించాలి. యాప్​, ట్రెండ్ ఏదైనా వ్యక్తిగత ఫొటోలు అప్​లోడ్ చేయకపోవడం మంచిది. 'ఇంటర్​నెట్​ ట్రెండింగ్​లతో జాగ్రత్త. నానో బనానా మాయలోపడి వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్​నెట్​లో కుమ్మరిస్తే ఇలాంటి మోసాలే జరుగుతాయి. ఫొటోలు, వ్యక్తిగత సమాచారాన్ని అప్​లోడ్ చేసే ముందు కచ్చితంగా ఆలోచించాలి. ఒక్కసారి నకిలీ వెబ్​సైట్లు, అనధికారిక యాప్​లకు డేటా వెళ్తే తిరిగి రాబట్టడం కష్టం' అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా సూచించారు.

"ఇంటర్​నెట్​ ట్రెండింగ్​లతో జాగ్రత్త. నానో బనానా మాయలోపడి వ్యక్తిగతసమాచారాన్ని ఇంటర్​నెట్​లో కుమ్మరిస్తే ఇలాంటి మోసాలే జరుగుతాయి. ఫొటోలు, వ్యక్తిగత సమాచారాన్ని అప్​లోడ్ చేసే ముందు కచ్చితంగా ఆలోచించాలి. ఒక్కసారి నకిలీ వెబ్​సైట్లు, అనధికారిక యాప్​లకు డేటా వెళ్తే తిరిగి రాబట్టడం కష్టం" - వీసీ సజ్జనార్, ఆర్టీసీ ఎండీ

ఈ యాప్​లు మీ ఫోన్​లో ఉంటే - సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని ఏం చేయలేరు!

అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ను స్థానిక కాల్స్‌గా మార్చే సిమ్‌ బాక్స్‌ - హైదరాబాద్​లో ముఠా సభ్యుల అరెస్ట్