మాయ చేసిన సైబర్ నేరగాళ్లు - క్రెడిట్ లిమిట్ పెంచుతామని ఖాతాలో డెబిట్ చేశారు
ఆలయ ఉద్యోగిని మోసగించిన సైబర్ నేరగాళ్లు - 4 క్రెడిట్ కార్డుల నుంచి రూ.8.72లక్షలు - వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడి లింక్ పంపించి బురిడీ

Published : September 23, 2025 at 5:32 PM IST
Cyber Crime In The Name Of Credit Card Limit : ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచేస్తున్నారు. వాట్సాప్‌లో నకిలీ లింకులు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని ఓ ఆలయ ఉద్యోగిని ఇలాగే మోసం చేసిన సైబర్ నేరగాళ్లు ఖాతాలో ఉన్నదంతా ఊడ్చేశారు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ నమ్మించి నట్టేట ముంచారు. మాటలతో మాయ చేసి లక్షల మేర కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు అనంతరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
రోజుకో రీతిన సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలతో అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ప్రజలకు ఈ తరహా మోసాలపై అవగాహన కల్పిస్తున్నా కేటుగాళ్లు కొత్త ఎత్తులు వేసి ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. కరీంనగర్‌కు చెందిన కట్టా జగన్నాథం అనే వ్యక్తి మూడేళ్లుగా కురవి శ్రీ వీరభద్రస్వామివారి ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు వాట్సాప్ కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామన్నారు.
"గర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి రకరకాల పేర్లు చెప్పి వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారే సైబర్ నేరగాళ్లు. వారికి ఎలాంటి వివరాలు ఇవ్వొద్దు. ఒకవేళ తెలియక ఇచ్చి మోసపోయినా గోల్డెన్ అవర్‌లో వాటిని స్తంభింపచేయవచ్చు. వెంటనే 1930 కి కాల్చేసి ఫిర్యాదు చేయొచ్చు. వెంటనే వారు మీ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేస్తారు. ఇలా డబ్బులను కాపాడుకోవచ్చు" -సర్వయ్య, మహబూబాబాద్ రూరల్ సీఐ
క్రెడిట్ కార్టు లిమిట్ : కట్టా జగన్నాథం ఫోన్‌కు లింక్ పంపిన కేటుగాళ్లు వారు చెప్పిన విధంగా చేయాలని సూచించారు. క్రెడిట్ కార్టు లిమిట్ పెరిగిందని నమ్మించారు. కట్టా జగన్నాథాన్ని నమ్మించిన కేటుగాళ్లు మిగతా క్రెడిట్ కార్డులు ఏమైనా ఉన్నాయని అని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత వాటిల్లోని డబ్బునంతా కొట్టేశారు. డబ్బులు పోయిన వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
"కట్టా జగన్నాథం అనే వ్యక్తి కురవిలోని ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని గుర్తుతెలియని నెంబర్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని చెప్పారు. మొదటగా తను వద్దని చెప్పగా పదే పదే బ్యాంకు ఫోన్ నెంబరుతో విజ్ఞప్తి చేయడంతో ఒప్పుకున్నారు. తర్వాత వాట్సాప్‌కు లింక్ పంపి సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగా చేస్తారు. అంతేకాకుండా ఏయే బ్యాంకుల్లో డెబిట్ కార్డులు ఉన్నాయో కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగినట్లు చూపిస్తుంది. కాసేపటికే అన్ని క్రెడిట్ కార్డుల్లో లిమిట్ చెక్ చేస్తే నిల్ బ్యాలెన్స్ చూపిస్తుంది. దీంతో పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం" -గండ్రాతి సతీశ్, కురవి ఎస్‌ఐ
ఒకవేళ సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేసినా గోల్డెన్ అవర్ ఒకటి ఉంటుందని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే 1930కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అపరిచిత కాల్స్ పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ యాప్‌లు మీ ఫోన్లో ఉంటే - సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని ఏం చేయలేరు!
నానో బనానా ట్రెండ్‌ను మీరూ ఫాలో అవుతున్నారా? - దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు

