మీ మొబైల్ దొంగతనం జరిగిందా? - ఈ ట్రిక్స్ ఫాలో కాకుంటే ఖాతా ఖాళీ!
సెల్‌ఫోన్లు చోరీలు చేస్తూ ఖాతాల్లోని డబ్బు కాజేస్తున్న కేటుగాళ్లు - యూపీఐ యాప్‌ల నుంచి ఖాతాల్లోని సొమ్ము దోచేస్తున్న నేరగాళ్లు - గూగుల్‌పే, ఫోన్‌పే, ఇతర డిజిటల్ చెల్లింపుల యాప్‌లను బ్లాక్ చేయాలని సూచన

Published : September 29, 2025 at 3:06 PM IST
Cybercriminals are Stealing Money from Accounts : ప్రస్తుతం సెల్‌ఫోన్ లేనిదే రోజు గడవటం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చరవాణి లేకుండా ఏ పనీ జరగడం లేదు. అయితే ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఫోన్ పోతే ఎంతో బాధపడతాం. కానీ ఆ ఫోన్ ద్వారానే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతుండటం కలవరపెడుతోంది. ప్రతిఫోన్‌లో డిజిటల్ చెల్లింపుల యాప్‌లు ఉండడంతో ఫోన్ కొట్టేసిన కేటుగాళ్లు యూపీఐ పిన్ మార్చేసి తేలిగ్గా డబ్బులు దోచేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. ఫోన్‌లలో యూపీఐ పిన్‌లు సేవ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు.
నిజామాబాద్‌కు చెందిన 62 ఏళ్ల రైతు హైదరాబాద్ వచ్చాడు. సెప్టెంబర్ 2న ఉదయం న్యూ బోయిన్‌పల్లి బస్‌స్టాప్‌లో హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్తున్న ఏసీ బస్సులో ఎక్కాడు. కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత తన జేబులో ఫోన్ లేదని గ్రహించాడు. బోధన్‌లో అత్యవసర పని ఉండటంతో వెంటనే ఫిర్యాదు చేయలేకపోయాడు. రెండు రోజుల తర్వాత పోయిన మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేసి అదే నంబర్‌తో కొత్త సిమ్ తీసుకున్నాడు. సెప్టెంబర్ 6న కొత్త మొబైల్ కొనుగోలు చేసి సిమ్ వేశాడు. సిమ్ కార్డు వేయగానే ఆయన రెండు బ్యాంక్ ఖాతాల నుంచి 6లక్షల 15వేలు డెబిట్ అయినట్లు గుర్తించి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే హైదరాబాద్ బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరో కేసులో రెండు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ఫోన్ పోగొట్టుకున్నాడు. పాతఫోన్ అని పట్టించుకోలేదు. మరుసటి రోజు మరో ఫోన్‌లో అదే నంబర్ సిమ్ కార్డు తీసుకుని వేశాడు. బ్యాంకు ఖాతాలోని 9 వేలు ఓ పెట్రోల్ బంక్‌లోని ఖాతాకు బదిలీ చేసినట్లు మెసేజ్ వచ్చి అవాక్కయ్యాడు. బ్యాంకు సిబ్బందిని ఆరా తీయగా ఫోన్ దొంగిలించిన వ్యక్తి ఆ పని చేసినట్లు తెలుసుకున్నాడు. సెల్‌ఫోన్లు చోరీలు చేస్తున్న నేరగాళ్లు, తెలివిగా వాటిలోని యూపీఐ యాప్‌ల నుంచి ఖాతాల్లోని సొమ్ము కాజేస్తున్నారు.
"రద్దీ ప్రదేశాల్లో, బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ ద్వారా పేమెంట్స్ జరుగుతున్నాయి. మొబైల్లో పిన్ నంబర్స్ సేవ్ చేసుకోవడం మంచిది కాదు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి."- తిరుపతి రాజు, బోయినపల్లి ఇన్స్పెక్టర్
మరో కేసులో నడికూడి రైల్వేస్టేషన్ నుంచి ధనుంజయరెడ్డి అనే వ్యక్తి ఏప్రిల్ 18న హైదరాబాద్ వెళ్లాడు. 20న తిరుగు ప్రయాణంలో మాచర్ల బస్సు ఎక్కుతుండగా అతని చరవాణిని దొంగిలించారు. గంట వ్యవధిలో అతను దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి సిమ్ బ్లాక్ చేయించాడు. రెండు రోజుల్లో కొత్త సిమ్ తీసుకొని వేరే చరవాణిలో వేసుకుని పరిశీలించగా నగదు స్వాహా అయినట్లు గుర్తించాడు. సైబర్ నేరగాళ్లు పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి పెట్రోల్ బంకు సిబ్బందికి ఫోన్‌పే చేసి 50,500 కొండమోడు సెల్‌షాప్ నిర్వాహకుల నుంచి 20 వేలు, చిలకలూరిపేటలో ఓ ఫొటో స్టూడియో యజమానికి ఫోన్ పే చేసి 93 వేలు తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం పెట్రోలు బంకు సిబ్బంది నుంచి 63 వేలు తీసుకుని ఖాతా ఖాళీ చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రహస్యంగా ఉంచాల్సిన యూపీఐ రహస్య పిన్‌ను కాంటాక్ట్ జాబితాలో సేవ్ చేయడం ఫోన్ పోయిన వెంటనే సిమ్, బ్యాంకు ఖాతాలు బ్లాక్ చేయకపోవడం ఖాతాల్లోని డబ్బుపోవడానికి ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. ఫోన్ పోగొట్టుకున్నా చోరీ జరిగినా ఖరీదైన కొన్ని ఫోన్లు మినహా సాధారణ సెల్‌ఫోన్లు అన్‌లాక్ చేయడం తేలికని గుర్తుచేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని చాలా చోట్ల సెల్‌ఫోన్ దుకాణాదారులు ఫోన్లను అన్‌లాక్ చేసి కొత్త సెక్యూరిటీ కోడ్‌లు పెట్టడం వంటివి క్షణాల్లో చేసేస్తున్నారు. ఆ తర్వాత నేరగాళ్లు ఫోన్‌లోని యూపీఐ యాప్‌లను డిలీట్ చేస్తున్నారు. సిమ్‌కార్డు ఫోన్‌లోనే ఉండడంతో మళ్లీ యూపీఐ యాప్‌లు డౌన్‌లోడ్ చేసి ఆ డబ్బుతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం లేదా ఇతరులకు డబ్బు బదిలీ చేసి నగదు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. అదంతా గంటల వ్యవధిలోనే జరుగుతోంది. ఇటీవలి కాలంలో కొన్ని ముఠాలు ఇదే పనిలో ఉన్నాయి. గతంలో ఫోన్ కొట్టేసి వేరే గ్యాంగ్‌కు విక్రయించేవారు. ఇప్పుడు ఫోన్‌లో లభ్యమయ్యే సమాచారంతో యూపీఐ నుంచి నగదు కొట్టేసేందుకు వెనకాడటం లేదు.
భవిష్యత్‌లో సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ పోగొట్టుకున్నా చోరీ అయినా ఆలస్యం చేయకుండా బ్యాంకు ఖాతాను తాత్కాలికంగా నిలిపి వేయించాలని చెబుతున్నారు. గూగుల్‌పే, ఫోన్‌పే, ఇతర డిజిటల్ చెల్లింపుల యాప్‌లను వెంటనే బ్లాక్ చేయాలని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అందుకే ఫోన్ చోరీకి గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, బ్యాంక్ ఖాతాలు, యూపీఐ సేవలు బ్లాక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మాయ చేసిన సైబర్ నేరగాళ్లు - క్రెడిట్ లిమిట్ పెంచుతామని ఖాతాలో డెబిట్ చేశారు
500 సినిమాల పైరసీ - సినిమా ఇండస్ట్రీకి రూ.3,700 కోట్లు నష్టం : సీవీ ఆనంద్

