Cyber Criminals Deceiving Users with Fake Websites: నకిలీ వెబ్‌సైట్లతో సైబర్ నేరగాళ్లు వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. వివిధ సంస్థల పేరుతో వెబ్‌సైట్లు సృష్టించి అమాయకులకు ఎర వేస్తున్నారు. వారి మాటలు నమ్మి ఆయా లింకులను క్లిక్ చేసిన వెంటనే ఖాతాలోని నగదును ఖాళీ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి శ్రీశైలానికి వెళ్లేముందు మల్లికార్జున సదన్ వెబ్‌సైట్‌ను సంప్రదించి గది కోసం డబ్బులు చెల్లించారు. శ్రీశైలంలోని మల్లికార్జున సదన్‌కు వెళ్లాక బుకింగ్ చేసుకున్న వెబ్‌సైట్ నకిలీదని తేలింది. సైబర్ నేరానికి గురైతే బాధితులు ఆలస్యం చేయకుండా 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
నిర్ధారణ తప్పనిసరి: వినియోగదారులు తొందరపడకుండా అసలు వెబ్‌సైట్లను నిర్ధారించుకున్న తర్వాతే వాటిని ఉపయోగించుకోవాలి. ఇలాంటి సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసేందుకు ముందుగా డొమైన్‌ను పరిశీలించాలి. .com, .org, .gov తదితర వాటిలో అక్షర దోషాలున్నా, తేడాలు కనిపిస్తే నమ్మొద్దు. /// :http తర్వాత ఉండే ఒక స్లాష్, రెండు సెమీకోలన్ గుర్తులు సక్రమంగా ఉంటేనే నిజమైనవిగా పరిగణనలోకి తీసుకోవాలి.
ఆన్లైన్లో లక్కీ డిప్ వచ్చిందా - లింక్‌పై క్లిక్ చేశారా మీ పని అంతే!
వెబ్‌సైట్‌ను యాక్సిస్ చేసిన సందర్భంలో మరో వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అయినట్లైతే అనుమానించాల్సి ఉంటుంది. నిజమైన వెబ్‌సైట్‌లలో about, contant అంశాలుంటాయి. నకిలీ వెబ్‌సైట్‌లో ఇవి ఉండవు. Wot అనే ఎక్స్‌టెన్షన్ ద్వారా నకిలీ వెబ్‌సైట్లను గుర్తించవచ్చు. దీనిని గూగుల్ క్రోమ్‌కు బ్రౌజర్ యాడ్ చేసుకుంటే కావాల్సిన వెబ్‌సైట్‌ను సెర్చ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ వెబ్‌సైట్‌కు ముందు గ్రీన్‌టిక్, నకిలీ వెబ్‌సైట్‌కు రెడ్‌టిక్ కనిపిస్తుందని పోలీసు అధికారులు వివరిస్తున్నారు. నిపుణుల సలహాలు తీసుకుని వెబ్‌సైట్‌లను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
నకిలీ వెబ్‌సైట్లతో బోల్తా:
- చదువు పూర్తై ఉద్యోగ వేటలో ఉన్న పలువురు నిరుద్యోగులు సైతం నకిలీ వెబ్‌సైట్లతో బోల్తా పడుతున్నారు. ఉద్యోగాలకు ఆశపడి సొమ్ము చెల్లించి నష్టపోతున్నారు.
- బ్యాంకుల పేరుతో రుణాలిస్తామని, పలు ఆధ్యాత్మిక కేంద్రాల పేరుతో దర్శనాలు, గదుల బుకింగ్, ట్రావెల్ ఏజెన్సీల పేరిట టికెట్ల ముసుగులో సైబర్ నేరగాళ్లు సామాన్యుల నుంచి నగదు దోచుకుంటున్నారు.
- వస్తువులకు సంబంధించిన ఉత్పత్తుల పేరుతో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నకిలీ వెబ్‌సైట్లలో ఉన్న ఆఫర్లను నమ్మి చాలామంది మోసపోతున్నారు. అసలు వెబ్‌సైట్‌ను నిర్ధారించుకోలేకనే ఎక్కువగా నష్టపోతున్నారు.
రాంగ్ కాల్ చేసిన వ్యక్తి మెసేజ్‌లకు రిప్లై - రూ.4 కోట్లు పోగొట్టుకున్న మహిళ
డేటింగ్ యాప్‌లో 'అనిత' హనీ ట్రాప్- వ్యాపారికి రూ.6.5 కోట్లు టోకరా!