Telangana Cyber Crime : ప్రతిరోజూ పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నా, చాలా మందిలో మార్పు అనేది కనిపించడం లేదు. నిత్యం వార్తల్లో సైబర్ నేరాల విషయమై చెబుతున్నా, సైబర్ దాడుల్లో మోసపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా డిజిటల్ అరెస్టు చేస్తున్నామని విశ్రాంత మహిళా ప్రొఫెసర్‌ను భయపెట్టి సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి రూ.1.60 కోట్లను కొట్టేశారు. ఆ మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, మేడ్చల్‌కు చెందిన విశ్రాంత మహిళా ప్రొఫెసర్‌కు ఇటీవల వాట్సప్ వీడియో కాల్ వచ్చింది. అందులో వారు దిల్లీ సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నామని, మనీ లాండరింగ్ అభియోగాలపై మీపై ఈడీ కేసు నమోదు చేసిందని చెప్పారు. తాను ఏమీ చేయలేదని ఆమె చెప్పినా వారు పట్టించుకోలేదు. మీరు కేవలం అనుమానితుల జాబితాలో ఉన్నారని, అందుకు సీబీఐ అధికారులతో మాట్లాడాలని తెలిపారు.
పాస్ పోర్టు రద్దు చేస్తామంటూ బెదిరింపు : ఆ తర్వాత మరో వ్యక్తి సీబీఐ అధికారినంటూ ప్రొఫెసర్‌కు కాల్ చేసి మాట్లాడాడు. అంతర్జాతీయ మనీ లాండరింగ్‌లో మీ ప్రమేయముందని, పాస్‌పోర్టు రద్దు అవుతుందని చెప్పారు. విదేశాలకు వెళ్లలేరని అతడు ఆమెను భయపెట్టాడు. అనంతరం మీకు ఎక్కడెక్కడ బ్యాంకు ఖాతాలు ఉన్నాయో వివరాలు ఇవ్వాలని ప్రొఫెసర్‌ను అడగ్గా, వాటి వివరాలను పంపించారు. ఆ బ్యాంకు లావాదేవీలన్నింటినీ తనిఖీ చేసి మనీలాండరింగ్ ఉన్నట్లు గుర్తిస్తే అరెస్ట్ చేస్తామని అతడు తెలిపాడు.
రిజర్వు బ్యాంకు తనిఖీ పూర్తయ్యే వరకు ఖాతాల్లోని డబ్బు తమకు బదిలీ చేయాలని ఆ సైబర్ నేరగాడు చెప్పాడు. అందుకు ట్రాయ్, సీబీఐ, దిల్లీ ఆర్థిక శాఖతో ఒప్పందం చేసుకున్నట్లు ఒక పత్రాన్ని ఆమెకు పంపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు దేశం విడిచి ఎక్కడికి వెళ్లొద్దని హెచ్చరించాడు. సీబీఐతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని ఇతరులకు చెప్పడం చట్ట విరుద్ధమని, ఉల్లంఘిస్తే జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా ఉంటాయని ఆ పత్రంలో నిందితుడు పేర్కొన్నాడు. వారు చెప్పిందంతా నిజమని నమ్మిన బాధితురాలు నిందితులు చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ.కోటి బదిలీ చేశారు.
ఏడు విడతల్లో రూ.60 లక్షలు : అయినా వారి వద్ద నుంచి మళ్లీ ఫోన్ చేసి మరింత డబ్బు పంపాలని బెదిరించేవారు. దీంతో ఆమె బంధువు వద్ద అప్పు తీసుకొని మరీ నెల రోజుల వ్యవధిలో ఏడు విడతల్లో రూ.60 లక్షలను బదిలీ చేశారు. చివరకు ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AI టూల్స్‌తో నకిలీ ఆధార్‌లు- KYC మోసాల ముప్పు- పెరుగుతున్న సైబర్ గండం
ఆకర్షణీయమైన జీతం అంటూ ప్రకటనలు ఇస్తారు - నమ్మి వెళితే 'నిర్బంధ చాకిరీ' చేయిస్తారు