CYBER CRIMES WITH VIRUS LINKS: ఓ వ్యక్తికి తన వాట్సాప్ గ్రూపుల్లో భారీ తగ్గింపు పేరుతో వచ్చిన ప్రకటన లింక్ చూశారు. దాన్ని క్లిక్ చేయగానే అతని బ్యాంకు అకౌంట్లో నుంచి డబ్బులు విత్‌డ్రా అయ్యాయి. అప్రమత్తమై బ్యాంకు అకౌంట్‌ను స్తంభింప చేసేసరికి దాదాపు డబ్బులన్నీ పోయాయి.
సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడతో జనాల డబ్బులను దోచేస్తున్నారు. లక్కీ డిప్, స్పిన్ వీల్, బ్యాంకుల పేరుతో వైరస్‌లతో కూడిన లింక్‌లను పంపిస్తున్నారు. సోషల్ మీడియాలో పెడతారు. దాన్ని క్లిక్ చేయగానే మీ ఫోన్లోకి మీకు తెలియకుండానే వచ్చేస్తారు. సమస్త సమాచారాన్ని చోరీ చేస్తారు. పాస్‌వర్డ్‌లు తెలుసుకుని బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేసేస్తారు. ఓ వ్యక్తికి ఒక సోషల్ మీడియాలో ‘లక్కీ స్పిన్ వీల్’ అనే ప్రకటన వచ్చింది. అది ఎక్కడ ఆగితే ఆ డబ్బులన్నీ మీవే అనే సరికి దానిపై క్లిక్ చేశారు. అంతే వెంటనే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులన్నీ మాయమై పోయాయి.
ఎలా తెలుసుకోవాలి?: APK అంటే ‘యాండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్’. ఇది ఫోన్లో యాప్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు ఉపయోగించే ఫైల్ ఫార్మాట్. ఇది ‘ఏపీకే’ అనే ఎక్స్‌టెన్షన్‌తో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తే అది ఏపీకే రూపంలోనే మీ ఫోన్లోకి వస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు వైరస్‌లను APK ఫైల్‌రూపంలో తయారు చేసి, సోషల్ మీడియాలో పెడుతున్నారు.
ఇది తెలియని వారు లింక్‌పై క్లిక్ చేయగానే అది ఫోన్లోకి వచ్చేస్తుంది. సైబర్ నేరగాళ్లు మీ ఫోన్‌ను తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. అలాగని అన్ని ఏపీకే ఫైల్స్ ప్రమాదకరం కాదని నిపుణులు తెలిపారు. గుర్తు తెలియని సంస్థల నుంచి, సోషల్ మీడియాలో ఉండే యాప్‌ల రూపంలో ఉండే ఏపీకే ఫైల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఎలా తొలగించాలి?: ఎవరైనా పొరపాటున అపరిచిత వ్యక్తులు పంపిన లింక్‌ను క్లిక్ చేసి, వైరస్ బారిన పడ్డారని అనుమానం వస్తే దాన్ని సరిచూసుకునే అవకాశం ఉంది. మీ ఫోన్లో ఏ యాప్ డౌన్‌లోడ్ చేసినా అది ‘ఫైల్ మేనేజర్ లేదా మై ఫైల్స్’లో ఉంటుంది. దీనిలోని ‘డౌన్‌లోడ్స్’ లేదా ‘ఇంటర్నల్ స్టోరేజ్’ లేదా ‘ఎస్‌డీ కార్డు’లోని ఫోల్డర్లను చెక్ చేయండి. వాటిలో ఏదైనా పేరు పక్కన డాట్ ఏపీకే అని ఉంటే అది వైరస్ లింక్ అయి ఉండొచ్చు. అనుమానం వస్తే దాన్ని డిలీట్ చేసేయాలి. మరింత భద్రత కోసం మీ ఫోన్‌ని ఫ్యాక్టరీ రీసెట్ చేసుకుంటే మంచిది. ఇలా చేస్తే మనం ఫోన్ కొన్నపుడు ఎలా కొత్తగా ఉంటుందో అదే తరహాలో ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి:
- గూగుల్ ప్లే స్టోర్ వంటి నమ్మదగిన సోర్స్‌ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.
- అపరిచిత వ్యక్తులు, సంస్థలు, సోషల్ మీడియాలో ఉండే వాటిని డౌన్‌లోడ్ చేసుకోవద్దు.
- ఫోన్లో యాంటీ వైరస్ ఉంచుకుని, తరచూ వైరస్ స్కాన్ చేయాలి.
- ఫోన్‌ని అప్డేట్గా ఉంచుకోవాలి.
- లక్కీ డ్రాలు, బ్యాంకుల పేరుతో సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లను క్లిక్ చేయకూడదు.
రాంగ్ కాల్ చేసిన వ్యక్తి మెసేజ్‌లకు రిప్లై - రూ.4 కోట్లు పోగొట్టుకున్న మహిళ
డేటింగ్ యాప్‌లో 'అనిత' హనీ ట్రాప్- వ్యాపారికి రూ.6.5 కోట్లు టోకరా!