Telangana Panchayat Elections Results2025

ETV Bharat / state

సైబర్ నేరగాళ్ల వలలో వృద్ధులు - మోసం పోయామని గుర్తించాక మానసిక వేదనతో కుంగుబాటు

సైబర్​ మోసాలకు వృద్ధులనే లక్ష్యంగా చేసుకుంటున్న నేరగాళ్లు - అధిక లాభాలంటూ ఆశచూపించి దోపిడీలు - డిజిటల్ అరెస్టులు, వాయిస్ ఛేంజ్‌తో మోసాలు - మనోవేదనతో కుంగుబాటుకు గురవుతున్న వృద్ధులు

Cybercrime Against Senior Citizens
Cybercrime Against Senior Citizens (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : August 29, 2025 at 5:28 PM IST

4 Min Read
Choose ETV Bharat

Cybercrime Against Senior Citizens : జీవితానుభవంలో వారు ఎంతోమందికి ఎన్నోసార్లు సలహాలు, సూచనలు జాగ్రత్తలు చెప్పారు. డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా పొదుపు చేయాలి అన్న దానికి వారే ప్రేరణగా నిలిచారు. కష్టపడి కోట్లు కూడబెట్టి కుటుంబానికి అండగానూ నిలిచారు. కానీ చివరికి సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కి జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు, పేరు, మర్యాదలు ఒక్కరోజులో పొగొట్టుకుంటున్నారు. అటు కుటుంబ సభ్యులకు ముఖం చూపించలేక, ఇటు సమాజంలో మోసపోయిన బాధితులుగా బతకలేక జీవిత చరమాంకంలో సతమతమవుతున్నారు. ఎప్పుడూ చిన్న తప్పు కూడా చేయని వారు ఒక్కసారిగా ఇంత పెద్దస్థాయిలో మోసపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మానసికంగానూ ఇబ్బందిపడుతున్న వృద్ధులకు పోలీసులు సైతం కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడుతున్నారు.

రెట్టింపు డబ్బు వస్తుందని ఆశపెట్టి : హైదరాబాద్‌ గచ్చిబౌలికి చెందిన ఓ 70 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగికి వాట్సప్‌లో ఓ సందేశం వచ్చింది. మీ ఉద్యోగ విరమణ బెనిఫిట్స్‌ను రెట్టింపు చేసుకునే సదావకాశం అంటూ సైబర్‌ నేరగాళ్లు వల విసిరారు. ట్రేడింగ్, క్రిప్టోలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఆశించవచ్చని ఆశపెట్టారు. వెంటనే అతన్ని ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్‌ చేయడంతో అందులో ఉన్న వారంతా తమకు పెద్దఎత్తున లాభాలు వచ్చాయని చెప్పడంతో విశ్రాంత ఉద్యోగికి నమ్మకం కుదిరింది.

సైబర్‌ నేరగాళ్లు చెప్పినట్లు ఓ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకుని కొంత పెట్టుబడి పెట్టగా తొలుత కొంత లాభం ఇచ్చారు. దీంతో పూర్తిగా నమ్మిన బాధితుడు విడతల వారీగా దాదాపు 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బు వెనక్కి తీసుకోవాలంటే ఛార్జీల పేరిట మరో 75 లక్షలు కాజేశారు. ఇంకా కావాలని ఒత్తిడి చేస్తుండటంతో డబ్బులు కావాలని కుమారుడిని అడగాడు. అతను పూర్తిగా ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. తాను మోసపోయానని వృద్ధుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కుంగుబాటుకు లోనవ్వడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కుమారుడిని పిలిపించి విషయం చెప్పడంతో అతను తనతో పాటు తండ్రిని దుబాయ్‌ తీసుకెళ్లాడు.

సీబీఐ అధికారినంటూ పరిచయం చేసుకుని : తిరుపతికి చెందిన 72 ఏళ్ల రామలక్ష్మికి సైతం ఇదే విధంగా వాట్సప్‌ కాల్‌ వచ్చింది. అవతలి వ్యక్తి తనకు తాను సీబీఐ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. మీ బ్యాంకు ఖాతా ద్వారా మనీలాండరింగ్ జరిగిందని చెప్పాడు. ఆమె ఆధార్‌, ఫోన్‌ నెంబర్ చెప్పి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ బెదిరించారు. మనీలాండరింగ్ చేసిన డబ్బులు వెంటనే కట్టాలంటూ ఒత్తిడి చేశారు. భయపడిన ఆమె దాదాపు రెండున్నర కోట్లు నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేసింది. ఆ తర్వాత మోసపోయానని గ్రహించినా భయంతో కుమారుడికి ఈ విషయం చెప్పలేకపోయింది.

తన జీవితాంతం కష్టపడిన సొమ్ము పోగొట్టుకున్న ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యింది. ఇప్పుడు డబ్బులు ఎక్కడా అంటే కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో ఆమెకు పాలుపోవడం లేదు. హైదరాబాద్​కి చెందిన 70 ఏళ్ల వృద్దుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వచ్చిన వాట్సాప్ సందేశానికి స్పందించాడు. మొదట 5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. మోసపూరిత యాప్ వాలెట్‌లో 10 లక్షల లాభం చూపించడంతో అత్యాశకు పోయి 5.98 కోట్లు పెట్టుబడి పెట్టి వాటిని కోల్పోయాడు. ఈ విషయం పిల్లలకు చెప్పలేక సతమతమవుతున్నాడు. కుటుంబం మొత్తం తనను నమ్మి డబ్బులు ఇస్తే తాను ఇలా మోసపోయానని ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. వాళ్ల ముందు ఎలా తలెత్తుకోవాలని బాధపడ్డారు.

ఏఐ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీతో బురిడీ కొట్టించి : సంగారెడ్డిలో ఉండే 68 ఏళ్ల వృద్ధురాలిని ఆమె మనవరాలి వాయిస్‌ను A.I. వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీతో వాయిస్ ఛేంజ్‌ చేశారు. తాను ప్రమాదంలో ఉన్నానని వెంటనే డబ్బులు పంపించాలంటూ ఏడుస్తున్నట్లు ఫోన్‌ చేశారు. ఆమె వెంటనే కంగారుపడి 3 లక్షలు బదిలీ చేసింది. ఆ తర్వాత మనవరాలు బాగానే ఉందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నా...ఇప్పుడు తన కుమార్తెకు డబ్బులు పోయిన విషయం ఎలా చెప్పాలని ఆమె వాపోయింది. అలాగే విజయవాడకు చెందిన ఓ వృద్ధుడిని సైతం సీఐడీ అధికారి పేరిట బురిడీ కొట్టించి 6 లక్షలు కాజేయ్యడంతో అతను హాస్పిటల్ పాలయ్యాడు.

వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా : వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులనే సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆర్థికంగా నష్టపోవడమేగాక మానసికంగానూ వారు తీవ్ర కుంగుబాటుకు గురవుతున్నారు. ఇన్నాళ్లు పిల్లలు, కుటుంబ సభ్యుల వద్ద గర్వంగా తలెత్తుకుని బతికిన వారంతా ఇప్పుడు వారికి కనీసం ముఖం చూపించలేకపోతున్నారు. ఉన్న డబ్బులన్నీ పొగొట్టారనే సూటిపోటి మాటలను తట్టుకోలేకపోతున్నారు. కోడళ్లు, అల్లుళ్ల వద్ద చిన్నతనంతో తలదించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తున్నాయి. ఎప్పుడూ తనకు ఎదురు మాట్లాడని కుమారులు సైతం చీదరించుకోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. కొంతమంది బాధితులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఎంతో అవసరమని పోలీసులు చెబుతున్నారు.

సైబర్‌ నేరగాళ్ల బారినపడిన వృద్ధులకు కుటుంబ సభ్యుల సపోర్ట్ ఎంతో అవసరం. ఒకవైపు డబ్బులు పోయిన బాధలో ఉన్నవారికి మేమున్నాం అంటూ చేయూత అందించకపోతే వారు మరింత ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే వృద్ధులకు సైబర్‌ నేరాలపైనా డిజిటల్ మోసాలపైనా తప్పనిసరిగా అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

10 రోజుల్లో 3 ముఠాల ఆటకట్టు - సైబర్​ క్రైమ్​ బృందం దూకుడు

సిటీలో కొత్త రకమైన మోసం - ముందు యూపీఐతో నగదు పంపిస్తారు, ఆ తర్వాత అకౌంట్​ ఫ్రీజ్​ చేపిస్తారు