ETV Bharat / state

'మీ ఖాతాలో సాయాన్ని జమ చేస్తాం' - రైతులను మోసం చేస్తున్న సైబర్​ నేరగాళ్లు

పథకం పేరుతో ఖాతాలో డబ్బులు వేస్తామని రైతులను నమ్మిస్తున్న సైబర్ నేరస్థులు - మొబైలోకి ఏపీకే ఫైళ్లను చొప్పించి డబ్బులు కొట్టేస్తున్న కేటుగాళ్లు

Cyber Crime in The Name Of Annadata Sukhibava
Cyber Crime in The Name Of Annadata Sukhibava (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 6, 2025 at 4:33 PM IST

2 Min Read
Choose ETV Bharat

Cyber Crime in The Name Of Annadata Sukhibava : సైబర్‌ నేరస్థులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త ఎత్తులు వేస్తూ ప్రజలను యథేచ్ఛగా మోసం చేస్తున్నారు. అయితే ఈ సారి ఏకంగా ప్రభుత్వ పథకానికే ఎసరు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఇటీవల 'అన్నదాత సుఖీభవ’ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో అర్హులకు మూడు విడతల్లో ఒక్కొక్కరికి రూ.20 వేలు జమ చేస్తోంది. ఈ పేరుతో సైబర్ నేరగాళ్లు వారం రోజులుగా పలు ప్రాంతాల్లో రైతులకు ఫోన్‌ చేసి ‘మీ ఖాతాలో సాయాన్ని జమ చేస్తామని’ నమ్మిస్తున్నారు. నిజమేనని నమ్మి కేటుగాళ్లు చెప్పినట్లే చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏపీకే ఫైళ్లను వాట్సాప్‌లో పంపి, తద్వారా ఫోన్లలో విలువైన సమాచారం తస్కరిస్తున్నారు. ఆపై ఖాతాల నుంచి డబ్బు డ్రా చేస్తున్నారు. విషయం తెలియక చాలా మంది మోసపోతున్నారు.

ఏపీకే ఫైళ్లను చొప్పించి డబ్బులు కొట్టేసి : సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ను ఏపీకే ఫైళ్ల ద్వారా చొప్పిస్తున్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని వాట్సాప్‌ ద్వారా పంపుతున్నారు. వీటిని క్లిక్‌ చేస్తే వివరాలు నమోదు చేసుకోవచ్చని నమ్మిస్తారు. ఇవి అత్యవసరం, తప్పనిసరి అని ఒత్తిడి తెచ్చి డౌన్‌లోడ్‌ చేయిస్తారు. వీటిని ఇన్‌స్టాల్‌ చేయగానే ఫోన్‌ హ్యాక్‌ అయి నియంత్రణ మోసగాళ్ల చేతిలోకి వెళ్తోంది. మొబైల్‌లో వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, నెంబర్లు, ఎస్‌ఎంఎస్‌లు, వంటివి అవతల వ్యక్తులకు సులభంగా చేరతాయి. అందులో సమాచారాన్ని మార్చేసి అదనంగా మాల్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తారు. ఫోన్‌లో బ్యాంకు ఖాతాలు, సోషల్‌ మీడియా ప్రొఫైల్స్, వ్యక్తిగత మెయిల్స్‌ మోసగాళ్ల నియంత్రణలోకి వెళ్తున్నాయి. బ్యాంకు ఖాతాల నుంచి అనధికార లావాదేవీలు నిర్వహించి నగదును తమ ఖాతాలకు బదిలీ చేసేస్తున్నారు.

వాట్సాప్‌లో పీఎం కిసాన్‌ ఏపీకే ఫైల్‌ : ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల రైతుకు ఇటీవల వాట్సాప్‌లో పీఎం కిసాన్‌ పేరుతో ఎస్‌ఎంఎస్‌ ఏపీకే ఫైల్‌ కూడా వచ్చింది. వెంటనే ఓ వ్యక్తి ఫోన్‌ చేసి నేను సచివాలయం నుంచి మాట్లాడుతున్నా పథకానికి అర్హత పొందాలంటే మీ వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకు ఏపీకే ఫైల్‌పై క్లిక్‌ చేయాలన్నాడు. నిజమని నమ్మి పేరు, ఆధార్‌ నెంబరు, బ్యాంకు ఖాతా వివరాలు ఎంటర్‌ చేశారు రైతు. ఇటీవల బ్యాంకు ఖాతా పరిశీలించగా రూ.2.30 లక్షలు డ్రా అవడం చూసి నిర్ఘాంతపోయారు. అలాగే తిరువూరులో ఓ రైతుకూ పీఎం కిసాన్‌ పేరుతో సంక్షిప్త సందేశం వచ్చింది. ఏపీకే ఫైల్‌పై క్లిక్‌ చేసి నిర్దేశిత ఫారంలో వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలని అపరిచితుడు ఫోన్‌ చేసి సూచించాడు. అతడు సూచించినట్లే రైతు వివరాలన్నీ నమోదు చేశారు. మర్నాడు ఖాతా నుంచి రూ.33 వేలు బదిలీ అయింది.

అప్రమత్తత అవసరం :

  • సంక్షేమ పథకాలపై సందేహాలు ఉంటే ప్రభుత్వ కార్యాలయంలోనే సంప్రదించాలి. అపరిచితులు పంపే ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్, క్లిక్‌ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
  • ఫోన్‌ సెట్టింగ్‌లలో ‘ఇన్‌స్టాల్‌ ఫ్రమ్‌ అన్‌నోన్‌ సోర్సెస్‌’ ఆప్షన్‌ డిజేబుల్‌ చేసుకోవాలి. దీంతో అనుమతి లేని యాప్స్‌ ఇన్‌స్టాల్‌ కావు.
  • యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసే ముందు అది ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలించాలి. ఒకవేళ తెలియక మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే వెంటనే ఆ ఫోన్‌ను రీసెట్‌ చేయాలని నిపుణులు తెలుపుతున్నారు.

'పేదలకు డబ్బు ఆశ చూపి బ్యాంక్‌ ఖాతాలు తెరిచి' - బెట్టింగ్​ ముఠా అరెస్ట్​

కంబోడియా సైబర్​ ముఠా గుట్టు రట్టు చేసిన ఏపీ పోలీసులు- రూ.41 లక్షలు రికవరీ