CV Anand Takes Charge as New CP of Hyderabad : గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్-నబీ పండుగను శాంతియుతంగా నిర్వహించడమే తన తొలి ప్రాధాన్య అంశమని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలోనూ హైదరాబాద్ కొత్వాల్‌గా పని చేసిన సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం మొదట్లో అవినీతి నిరోధక శాఖ డీజీగా బదిలీ చేసింది. మాజీ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్థానంలో సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం ఇటీవల పునర్నియమించింది.
పోలీస్ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటేనే శాంతి భద్రతలకు రక్షణ ఉంటుందన్న సీపీ, నేరస్థులతో కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. సాధారణ ప్రజలతో మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో పూర్తిగా డ్రగ్స్ నిర్మూలించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నామని, ఆ దిశగా అధికారులతో సమీక్షంచి తర్వాత ప్రణాళికను సిద్ధం చేస్తామని సీపీ వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పార్ట్ ఆఫ్ పోలీసింగ్ విధానంలోనే ఉంటుందని హైదరాబాద్ సీపీ తెలిపారు. క్రిమినల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ హెచ్చరించారు.
రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్‌లకు స్థానచలనం - హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
చర్చనీయాంశంగా మారిన బదిలీ : హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆకస్మిక బదిలీ పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలు మహానగరంలో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతిష్ఠాత్మకంగా జరిగే సంబరాల్లో శాంతిభద్రతలు, బందోబస్తు, ట్రాఫిక్ పర్యవేక్షణ చాలా కీలకం. అందుకే ఈ సమయాల్లో పోలీసు అధికారుల బదిలీలు ఉన్నా వాటిని వాయిదా వేస్తుంటారు.
పాత ఆనవాయితీని వదిలి : తాజాగా పాత ఆనవాయితీకి తెర దించుతూ శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా బదిలీ చేయడం ఆయన స్థానంలో అనిశా డీజీ సీవీ ఆనంద్‌ను నియమించడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది డిసెంబరులో సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 8 నెలల వ్యవధిలో తనదైన శైలిలో తన బాధ్యతలు నిర్వర్తించారు.
తనదైన శైలిలో బాధ్యతలు చేపట్టి : యాంటీ సెల్‌ఫోన్ స్నాచింగ్ బృందాలను ఏర్పాటు చేసి గస్తీ పెంచారు. స్నాచర్లను పట్టుకునే క్రమంలో దొంగలపై పోలీసులు కాల్పులు జరపడం, ఇలాంటి ఘటనలు రెండు, మూడుసార్లు చోటుచేసుకున్నాయి. సంవత్సరం పూర్తికాకుండానే ఆయన స్థానచలనం ఎవరూ ఊహించలేదు. గతంలో నగర సీపీగా పనిచేసిన సీవీ ఆనంద్‌కు హైదరాబాద్ గట్టి పట్టుంది. కొత్త విధానాలతో శాంతిభద్రతలను గాడిలో పెట్టారు.