Bihar Election Results 2025

ETV Bharat / state

స్వర్గం చూడొచ్చంటూ ఆశపెట్టారు - రూ.2 వేల కోట్లు కాజేశారు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులంటూ రూ.2 వేల కోట్ల మోసం - రూ.కోటికి పైగా పెట్టిన వారు 300 మంది - ఏళ్లు గడుస్తున్నా డబ్బులు తిరిగి రాకపోవడంతో అయోమయంలో బాధితులు

Crypto Investment Fraud In Telangana
Crypto Investment Fraud In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 13, 2025 at 2:54 PM IST

3 Min Read
Choose ETV Bharat

Crypto Investment Fraud In Telangana : రూ.లక్షల్లో పెట్టుబడులు పెడితే రూ.కోట్లలో లాభాలు వస్తాయని మాయా ప్రపంచాన్ని సృష్టిస్తారు. రంగుల గ్రాఫిక్స్​తో అంతర్జాతీయ స్థాయి కంపెనీలను రూపొందిస్తారు. మూడు నెలల్లోనే డబ్బులు మూడింతలు పెరుగుతాయంటూ ఆశ కల్పిస్తారు. వీరి మాటలు నమ్మి పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు పెట్టుబడులు పెట్టి, భారీ మొత్తంలో మోసపోతున్నారు.

రూ.2 వేల కోట్ల మోసాలు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టిన వేలాది మంది రూ.2 వేల కోట్ల వరకు నష్టపోయినట్లు అంచనా. ఈ విధంగా పెట్టుబడి పెట్టిన వారిలో రూ.కోటికి పైగా పెట్టి నష్టపోయిన వారు 300 మంది వరకు ఉండవచ్చని అంచనా. ఇటీవల కొడిమ్యాలకు చెందిన ఓ మహిళ క్రిప్టో కరెన్సీ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశమైంది. అప్పు చేసి క్రిప్టో కరెన్సీలో పెట్టిన పెట్టుబడి ఏళ్లు గడుస్తున్నా తిరిగి రాక, ఎలా రాబట్టుకోవాలో తెలియక కొందరు సతమతమవుతున్నారు.

మాయా ప్రపంచాన్ని చూపించి ఆశ పెడతారు : క్రిప్టో కరెన్సీలో మొదట పెట్టుబడి పెట్టిన వారికి యాప్​ల నిర్వాహకులు రెట్టింపు ముట్టజెప్పి, కార్లు బహుమతిగా ఇచ్చారు. దీంతో ఆశతో కొందరు రూ.లక్షల్లో పెట్టినట్లు తెలిసింది. డిజిటల్ వ్యాలెట్ చెల్లింపు వ్యవస్థను క్రిప్టో కరెన్సీగా పిలుస్తారు. దీనికి సంబంధించి ఎక్కడా ఎలాంటి కార్యాలయం ఉండదు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటూ తమకు పెద్ద పెద్ద కంపెనీలతో పాటు గోల్డ్​ మైన్స్ తదితర వ్యాపారులున్నట్లు వెబ్​సైట్స్​లో రంగుల మాయా భవనాలను సృష్టించి ఆకర్షిస్తారు.

సకాలంలో ఫిర్యాదు చేస్తే : క్రిప్టో కరెన్సీ బాధితులు సకాలంలో ఫిర్యాదు చేస్తే నిర్వహణలో ఉన్న యాప్​ల నిర్వాహకులపై చర్యలు తీసుకునే వీలుంటుందని మల్యాల సీఐ నీలం రవి తెలిపారు. చాలా గ్రామాల్లో బాధితులున్నట్లు తెలిసిందని అన్నారు. క్రిప్టో కరెన్సీ పేరుతో ప్రమోటర్లుగా చలామణి అవుతున్న వ్యక్తుల వల్లే చాలా మంది మోసపోతున్నారని పేర్కొన్నారు.

ఖాతా బ్లాక్‌, కనిపించని యాప్‌ :

  • క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టిన వారికి ఖాతా నంబరు, ఈ-మెయిల్ ఐడీతో పాటు పాస్​వర్డును కేటాయిస్తారు. అందులోనే డబ్బును డాలర్లుగా మార్చి జమ చేయాల్సి ఉంటుంది.
  • ఎన్నిసార్లు డబ్బులు పంపితే అన్ని యూజర్ ఐడీ, పాస్​వర్డులు కేటాయిస్తారు.
  • పెట్టుబడికి మూడు నెలల్లోగా రెట్టింపు చెల్లిస్తామని చెప్పి, కొన్ని రోజుల తర్వాత ఖాతాను బ్లాక్ చేయడంతో పాటు ఇంటర్నెట్​లో క్రిప్టో కరెన్సీ యాప్​ను కనిపించకుండా చేస్తారు.
  • బాధితులు డబ్బుల కోసం ప్రమోటర్ల చుట్టూ తిరుగుతూ చివరికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ యాప్​లు వందల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం.

స్వర్గం చూపిస్తారు : ఈ-మెయిల్ ద్వారా డాలర్ల రూపంలో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టే వారికి ప్రమోటర్లు స్వర్గాన్ని చూపిస్తారు. వీటిపై ప్రభుత్వాలకు నియంత్రణ ఉండదు. పెట్టుబడి మొత్తాన్ని బట్టి ఫోన్, ల్యాప్​టాప్, 10 గ్రాముల బంగారం ఇవ్వడంతో పాటు కోరుకున్న పట్టణంలో విల్లా, కార్లు, గోవా, బెంగళూరుతో పాటు దుబాయి, మలేషియా తదితర దేశాల పర్యటనకు తీసుకెళ్తారు.

అక్కడ విందులు, వినోదాలు సమకూర్చడంతో పాటు హెలికాప్టర్​లో తిప్పిస్తారు. అనంతరం కంపెనీ ప్రతినిధులుగా కొందరు మోటివేషనల్ స్పీచ్​లు ఇస్తారు. 'డబ్బులు సంపాదించి మాలాగా ఉన్నతంగా జీవించాలనుకుంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి. సందేహాలు మాత్రం అడగొద్దు' అంటూ నమ్మిస్తారు. బిజినెస్​ చేసే వ్యక్తులకు 1, 3, 5, 7, 10 సంఖ్యల పేర్లతో స్టార్లు కేటాయించి ప్రోత్సహిస్తారు.

నెలకు రూ.10 వడ్డీ అంటూ రూ.50 కోట్ల మేర మోసం - నిందితుడు అరెస్ట్

ఆశపడ్డామో నిండా ముంచేస్తారు - నాగర్​కర్నూల్​లో వెలుగుచూసిన 7కోట్ల మోసం