Covid Cases in AP 2025 : వానలతో గాలిలో పెరుగుతున్న తేమ శాతం వల్ల కరోనా వైరస్ ఉనికి చాటుకుంటోందని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో న్యుమోనియా, మలేరియా, ఫ్లూ, డెంగీ, వాంతులు, విరేచనాలు, కామెర్ల కేసులు అధికంగా నమోదవుతుంటాయి. అలాగే కరోనా వైరస్ కూడా తేమతో కూడిన వాతావరణంలో వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగి ఉంటుందని పేర్కొంటున్నారు. ‘కరోనా వైరస్ ప్రభావం నిర్దిష్టంగా ఎంతకాలం వరకు కనిపిస్తుందన్నది చెప్పలేం. వైరస్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది’ అని సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గోపిచంద్ తెలిపింది.
గత నెల చివరి వారం నుంచి దేశంలో కరోనా కేసుల నమోదు ప్రారంభమైంది. గత వారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనూ వెలుగు చూస్తున్నాయి. పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నా గత అనుభవాల దృష్ట్యా కరోనా పలువురిలో మానసిక ఆందోళనను పెంచుతోంది. ఏపీలో ఇప్పటివరకు కొవిడ్ బారినపడిన వారిని పరిశీలిస్తే స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. అందరి ఆరోగ్యం బాగానే ఉందని తేలింది. బాధితుల్లో ఉన్న ఇద్దరు వృద్ధులపై ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంది. కాకినాడ, గుంటూరు, విశాఖ ఇతరచోట్ల కలిపి సుమారు 25 వరకు కేసులు ఉంటాయని తెలుస్తోంది.
వైరాలజీ ల్యాబ్‌ల్లో నమూనాల పరీక్షలు : కాకినాడ, విశాఖ, అనంతపురం, విజయవాడ, గుంటూరు,కడప, కర్నూలు బోధనాసుపత్రులు, తిరుపతి స్విమ్స్, మంగళగిరి ఎయిమ్స్‌లలో వైరాలజీ ల్యాబ్‌లు ఉన్నాయి. వీటి నిర్వహణకు ఐసీఎంఆర్ నుంచే నిధులు అందుతున్నాయి. హాస్పిటల్స్ నుంచి వచ్చిన నమూనాలను ఆయాచోట్ల పరీక్షిస్తున్నారు. వీటిలోని ఓ ల్యాబ్‌లో 2023 జనవరిలో 65 నమూనాలకు 4, మార్చిలో 155కు 6, ఏప్రిల్‌లో 1,256కు 22, డిసెంబర్లో 65కు ఒకటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
2024 జనవరిలో 65కు 4, మేలో 75కు ఒకటి చొప్పున కొవిడ్ పాజిటివ్ నిర్ధారణైంది. కొన్ని నెలల్లో పాజిటివ్ కేసులు లేవు. 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏపీలో 17,000ల వరకు నమూనాలను పరీక్షించారు. అందులో 286 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ నెలలో ఇప్పటివరకు పరీక్షించిన నమూనాల్లో రెండు పాజిటివ్‌గా తేలాయి. ఈ ల్యాబ్‌ల్లో ఆర్‌టీపీసీఆర్ పరీక్షల ఫలితాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
ఆందోళన అక్కర్లేదు : ఎన్‌బీ 1.8.1 వేరియంట్ ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. దీని తీవ్రత తక్కువగా ఉంది. కొన్ని దేశాల్లో కేసులు పెరిగినప్పటికి గత వేరియంట్లతో పోల్చితే తీవ్ర అనారోగ్యాన్ని కలిగించినట్లు ఆధారాలు లేవు. జన్యుపరిణామ క్రమం ప్రకారం అన్నీ ఒమిక్రాన్ ఉప వేరియంట్లుగానే తేలినట్లు ఇటీవల ఐసీఎంఆర్ వెల్లడించింది. మరో రెండు, మూడు వారాల అనంతరం కేసులు తగ్గిపోవచ్చని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహం అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణ జాగ్రత్త చర్యలు సరిపోతాయని పేర్కొన్నారు. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ నరసింహం సూచించారు.
నిర్ధారణ పరీక్షల పెంపు : ఏపీలో నమోదైన కరోనా కేసుల నమూనాల్లో ర్యాండమ్‌గా ఎంపిక చేసిన వాటికి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్ జన్యు పరిణామక్రమం ఫలితాన్ని అనుసరించి వైరస్ తీవ్రతపై అంచనాకు వచ్చేందుకు వీలుంటుందని పేర్కొంటున్నారు. ఈ మేరకు పరీక్షల నమూనాలను విశాఖ, తిరుపతి స్విమ్స్‌ల నుంచి పుణేకు పంపినట్లు తెలిసింది. ఇతర వైరాలజీ ల్యాబ్స్‌లో నమోదైన పాజిటివ్ కేసుల నమూనాలను కూడా పుణేకు పంపనున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఆయాసంతో బాధపడే వారికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. వైరస్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు రానున్న రోజుల్లో ర్యాండమ్ విధానంలో నిర్ధారణ పరీక్షలను పెంచబోతున్నారు. తాజా పరిస్థితులపై డీఎంఈ అధికారులు గురువారం నాడు సమీక్షించారు.
ఏపీలో కరోనా కేసుల కలకలం - నిర్ధారణ పరీక్షలు విస్తృతం చేయాల్సిందే