Covid 19 Case in Visakhapatnam: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ వచ్చింది. ఇప్పటివరకు చాప కింద నీరులా ఉన్న కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. విశాఖ జిల్లాలో కొవిడ్-19 కేసు నమోదైంది. మద్దిలపాలెంకు చెందిన మహిళకు కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా RTPCR పరీక్షలు చేశారు. తొలుత మలేరియా, డెంగీ అని భావించి పరీక్షలు చేయగా, కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
తొలుత నగరంలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. అనంతరం విశాఖ కేజీహెచ్‌లోని వైరాలజీ ల్యాబ్‌లోనూ పరీక్షించిగా అక్కడ కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. పాజిటివ్ కేసు వచ్చిన పరిసర ప్రాంతాల్లో మూడు టీమ్‌లతో ఇంటింటికీ సర్వే చేయడం సహా, చుట్టుపక్కల వారందరికీ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ముందస్తు జాగ్రత్తలు: కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని, వైద్యుల సలహాలు, సూచనలు అనుసరించి మందులు వాడాలని పేర్కొంది. ప్రయాణాల్లోనూ, జనసమూహాల్లో ఉన్నప్పుడు తప్పని సరిగా మాస్కులు వాడాలని అధికారులు తెలిపారు. కొవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినవారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.
కేరళలోనూ: మే నెలలోనే కేరళలో 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అత్యధికంగా కొట్టాయం జిల్లాలో 57 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు ఉన్నట్లు చెప్పారు. కేరళలో కొవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలతో బాధపడేవారు తప్పసరిగా మాస్క్ ధరించాలని వీణా జార్జ్ అన్నారు.