Couple Fight Reasons : అరే నువ్వు మగాడివి. నువ్వు వెనకడుగు వేస్తే లోకువ అవుతావ్ ఆలోచించుకో. ఆ తర్వాత నీ ఇష్టం.
నీకేం తక్కువ. ఆడపిల్లవు అయినా మంచిగా చదువుకున్నావ్. మీ భర్త కంటే ఎక్కువగా సంపాదిస్తున్నావ్. ఒక్కసారి తలదించుకుంటే జీవితాంతం భరించాల్సిందే ఆలోచించుకో. ఆ తర్వాత నీ ఇష్టం.
రెండు నిమిషాలు మాట్లాడుకుంటే పరిష్కారం : భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవలను సరిదిద్దాల్సిన పెద్దల నోటి నుంచి వస్తున్న మాటలకు ఉదాహరణలు ఇవి. ఎన్నో సంవత్సరాల సంసారాన్ని ఈదిన అనుభవంతో తప్పొప్పులు పంచుకోవాల్సిన పెద్దలు ఇలాంటి మాటలు చెబుతున్నారు. డబ్బు ఉంటే చాలు తోడు లేకున్నా బతికేయవచ్చంటూ తమవారిదే పైచేయి కావాలనే పట్టుదలతో ఆలుమగల మధ్య ఎడబాటును పెంచుతున్నారు. రెండు నిమిషాలు మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే ప్రాబ్లమ్‌ను తమ ప్రతికూల ఆలోచన ధోరణితో జటిలం చేస్తున్నారని అంటున్నారు మనస్తత్వ నిపుణులు. ఆలుమగల కాపురంలో కలతలను అధిగమించేందుకు పిల్లలకు టైం ఇస్తే చాలని హైదరాబాద్ నగర షీ టీమ్స్ డీసీపీ డాక్టర్ లావణ్యనాయక్ జాదవ్ అంటున్నారు.
మూడో వ్యక్తి జోక్యంతోనే : వివాహమై రెండు సంవత్సరాలైనా భార్యాభర్తలిద్దరూ మంచి కంపెనీల్లో జాబ్ చేస్తున్నారు. అత్తమామలు తరచూ రావటం భార్యకు నచ్చలేదు. ఆఫీసు పనితో పాటు ఇంటి పని పెరగడంతో ఒత్తిడికి గురైంది ఆమె. ఇదే విషయాన్ని భర్తతో పంచుకుంది. ప్రతికూల జవాబు రావటంతో పుట్టింటికి చేరింది. అత్తింటివారు వేధిస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇప్పుడామె ఎలాగైనా తమను కలపమంటూ పోలీసుల చుట్టూ తిరుగుతోందని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వివరించారు. 40 నుంచి 50 % దంపతులు మూడో వ్యక్తి జోక్యంతోనే సంసారాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారని సైకాలజిస్టు డాక్టర్ గీతా చల్లా అన్నారు. కొత్తగా వివాహం అయ్యి గిల్లికజ్జాలతో తమ వద్దకు వచ్చే వారికి సర్దుకోమని చెప్పటం, మీరే చర్చించుకోవాలని పేరెంట్స్ సూచిస్తే ఎడబాటుకు అవకాశమే లేదని అంటారు.
చట్టపరమైన చర్యలు : హైదరాబాద్ నగరంలో 7 మహిళా పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చారు. గృహహింస, వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తూనే దంపతుల మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేసి కౌన్సెలింగ్‌తో దగ్గర చేస్తున్నారు. అప్పటికీ కలసి నడవలేమంటూ చెప్పినపుడు చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
కుటుంబసభ్యుల జోక్యమే గొడవలకు కారణం : నగర కమిషనరేట్ పరిధిలోని 7 మహిళా పోలీస్ స్టేషన్లో నెలకు 400 నుంచి 500కు పైగా ఫిర్యాదులు వస్తుంటాయి. అధికంగా జీవిత భాగస్వామితో సర్దుకుపోలేకపోవటం, సామాజిక మాధ్యమాలు, అనుమానం, సెల్‌ఫోన్లు, బాధ్యతారాహిత్యం, కుటుంబసభ్యుల జోక్యమే గొడవలకు కారణమని షీటీమ్స్ డీసీపీ డాక్టర్ లావణ్య నాయక్ జాదవ్ అన్నారు.
పెళ్లి ఎంత సహజమో, విడాకులు కూడా అంతేనా!
73ఏళ్ల భార్య 69ఏళ్ల భర్త విడాకులు - రూ.3.7 కోట్లతో 43ఏళ్ల వివాహానికి కాస్ట్లీ ఎండ్‌కార్డ్!