Corruption In DMHO At Srikakulam District: ఉద్యోగ నియామకాలు, బదిలీలు, డిప్యుటేషన్లు, సర్వీస్ రిజిస్టర్ల అప్‌గ్రేడ్, ఇలా ఒకటేమిటి ఏ పని చేయాలన్నా సరే చేయి తడపాల్సిందే! ఆఖరికి మెడికల్ లీవ్ తర్వాత తిరిగి విధుల్లో చేరాలన్నా అధికారులకు దక్షిణ చెల్లించాల్సిందే! లేకుంటే దస్త్రం ముందుకు కదలదు. సిక్కోలు వైదార్యారోగ్య శాఖలో అడుగడుగునా అవినీతి తాండవిస్తోంది. తాజాగా డీఎంహెచ్‌వోతో పాటు క్యాంప్ క్లర్క్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.
ఏసీబీకి చిక్కిన లంచాధికారులు: శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు అవినీతి మకిలి పట్టింది. డీఎంహెచ్‌వో కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందని కొన్నాళ్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. చిన్నస్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు పనికో ధర నిర్ణయించి డబ్బులు దండుకోవడం నిత్యకృత్యంగా మారింది. కళ్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దివ్యాంగురాలు కాంతమ్మ కొంతకాలంగా సెలవులో ఉన్నారు. ఆమెను తిరిగి విధుల్లోకి చేర్చుకునేందుకు డీఎంహెచ్‌వో లంచం డిమాండ్ చేశారు. కాంతమ్మ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వీరి అవినీతి బండారం బయటపడింది. డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణతో పాటు క్యాంపు క్లర్క్ సురేష్ కుమార్ ఈ నెల 3వ తేదీన కాంతమ్మ నుంచి 20 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఓ అధికారి అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఉన్నతాధికారులతో చేతులు కలిపి పెద్ద మొత్తంలో దోచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎంఎస్‌వో, ఎఫ్ఎన్వో, సహాయకుల నియామకంలో చేతివాటం చూపినట్లు సమాచారం. ఉద్యోగ పదోన్నతుల విషయంలో సీనియర్లను పక్కనపెట్టి మరీ ముడుపులు ఇచ్చిన జూనియర్లకే ప్రమోషన్లు. ఇక డిప్యుటేషన్‌లోనూ పైసలిచ్చినవారికే పచ్చజెండా. మెరిట్ లిస్ట్‌లో పేరుంటే సరిపోదు. చేయి తడిపినోళ్లకే కొలువులు. నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ ఎంతో మంది ఫిర్యాదులు చేశారంటే అవినీతి ఎంత పెద్దమొత్తంలో జరుగుతోందో తెలుస్తోంది.
అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు సిబ్బంది బదిలీలు జరిగినా వెళ్లకుండా డిప్యుటేషన్‌పై ఇక్కడే పనిచేస్తుండటం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అవినీతి అధికారి ఉద్యోగ నియామకం ఉన్నతాధికారుల సిఫార్సులకు విరుద్ధంగా ఉందని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇలాంటి అవినీతి తిమింగలాలను సస్పెండ్ చేస్తే తప్ప పరిస్థితి మారదని తోటి ఉద్యోగులే చెబుతున్నారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియమితులైన అధికారులే ఇప్పటికీ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. గతంలో చేపట్టిన నియమాకాలు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సుల బదిలీల్లో జరిగిన అవకతవకలపై ఇంకా విచారణ సాగుతూనే ఉంది. అవి తేలకముందే అధికారుల దందా బయటపడటం కలవరం రేపుతోంది. కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని సమగ్ర విచారణ చేయించి అవినీతి కంపును వదిలించాలని ఉద్యోగులు కోరుతున్నారు.