MLA Aadi Srinivas Fires on Harishrao : రుణమాఫీపై రైతులను రెచ్చగొట్టేందుకు మాజీమంత్రి హరీశ్‌రావు చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించవని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. రైతుల గురించి బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు, కేటీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆది శ్రీనివాస్ హితవు పలికారు.
రైతులను రెచ్చగొడుతున్నారు : రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని హరీశ్‌రావు దుఃఖంలో మునిగిపోయారని అది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. రుణమాఫీ అవుతుందన్న బెంగతో ఆయనకు కన్నీళ్లు ఆగడం లేదని ఆరోపించారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారన్న ఉక్రోశంతో హరీశ్‌రావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను రెచ్చగొట్టడమే హరీశ్‌రావు పనిగా మారిందని విమర్శించారు.
రైతులను పరామర్శించలేదు : మామ ఫామ్‌హౌస్‌లో, బామ్మర్ది అమెరికాలో జల్సా చేస్తుంటే హరీశ్‌రావు హైదరాబాద్‌లో విషం చిమ్ముతున్నారని ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రైతులపైన అంత ప్రేమ ఉంటే కేసీఆర్‌తో హరీశ్‌రావు ఎందుకు ఒక ప్రకటన కూడా చేయించలేదని ప్రశ్నించారు. వర్షాల కారణంగా నష్టపోయిన ఒక్క రైతును కూడా ఎందుకు కేసీఆర్ పరామర్శించలేదని నిలదీశారు. మేనిఫెస్టోలో ఏమి పెట్టామో, అది చేస్తున్నామన్న ఆయన రుణమాఫీకి తమ ప్రభుత్వం ఏలాంటి కొత్త నిబంధన పెట్టలేదని పేర్కొన్నారు.
రుణమాఫీపై గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే తాము అనుసరించినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. రెండు లక్షలకుపైగా ఉన్న రుణాన్ని ఎందుకు చెల్లించాలని హరీశ్‌రావు అడుగుతుండడాన్ని ఆయన తప్పు బట్టారు. రైతులను రుణ విముక్తి చేసి మళ్లీ రుణం తీసుకోవాలన్నదే తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
"రుణమాఫీపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ప్రజలలో విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉంది. ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ కచ్చితంగా చేస్తాము. అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన రైతులకు రుణమాఫీ చేస్తాము. ఓ వైపు వరదలతో అతలాకుతలమవుతున్న ప్రజలను పట్టించుకోకుండా, రాజకీయాలు చేస్తున్నారు". - ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్