NOTICES TO RAMANAIDU STUDIO: విశాఖలోని రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెండు వారాల సమయం ఇస్తామని, వారి వివరణ తర్వాత చర్యలు ఉంటాయని కలెక్టర్ అన్నారు. రామానాయుడు స్టూడియోకు చిత్ర నిర్మాణ పరిశ్రమ, స్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వం 34 ఎకరాలకు పైగా భూమిని కేటాయించిందని, అందులో 15.17 ఎకరాలు హౌసింగ్ లేఅవుట్ కోసం మార్పు చేయాలని గతంలో స్టూడియో యాజమాన్యం కోరిందన్నారు. అయితే అది నిబంధనలకు విరుద్ధమని, నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ వివరించారు.
సిసోదియా ఆదేశాల మేరకు: రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూముల వ్యవహారంపై ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన 15.17 ఎకరాల భూ కేటాయింపు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. నిర్దేశించిన ప్రయోజనం కోసం ఇచ్చిన భూమిని ఇతర ప్రయోజనాల కోసం వినియోగిస్తే రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు. సిసోదియా ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తాజాగా నోటీసులు జారీ చేశారు.
ఇదీ జరిగింది: కాగా సినిమా స్టూడియో నిర్మాణం, సంబంధిత అవసరాల కోసం మాత్రమే కేటాయించిన 34.44 ఎకరాల భూమిలో 15.17 ఎకరాల భూమిని ఇళ్ల లేఅవుట్ కోసం వైఎస్సార్సీపీ హయాంలో రామానాయుడు స్టూడియో అభ్యర్థించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అదే విధంగా భూ మార్పిడికి అనుమతించొద్దని జనసేన నేత మూర్తి యాదవ్ సైతం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఇటీవల ఈ భూముల రద్దుకు సంబంధించి రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ను రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన ఆర్పీ సిసోదియా ఆదేశాలు జారీ చేశారు. తగినంత సమయం ఇచ్చి తరువాత చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా జిల్లా కలెక్టర్ విశాఖలోని రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వం కీలక నిర్ణయం - రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు