COLLECTOR DISTRIBUTES RATION ITEMS : చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా రేషన్ డీలర్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపించి వారికి సరుకులను అందజేస్తోంది. ఇందులో భాగంగా కొందురు కలెక్టర్లు జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో భీమవరంలో కలెక్టర్ లబ్ధిదారులకు సరుకులు అందజేశారు. అంతేకాకుండా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ఏడో వార్డులో పలువురు వృద్ధులు, దివ్యాంగుల ఇంటికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వెళ్లారు. వారికి రేషన్ సరుకులు అందజేశారు. రేషన్ సరుకుల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, నేరుగా ఇంటి వద్దే అందజేస్తామని లబ్ధిదారులకి తెలిపారు. ఈ సందర్భంగా అక్కడి వృద్ధులు, దివ్యాంగులతో మాట్లాడారు. పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా పింఛన్, రేషన్ సరుకులు ఇంటి వద్దకే వస్తాయని, ఎటువంటి చింత అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. ఆమెతోపాటు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డీఎస్ఓ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో కలెక్టర్ తనిఖీలు: అదే విధంగా రెండు రోజులు క్రితం మరో కలెక్టర్ రేషన్ లబ్ధిదారు ఇంటిలో భోజనం చేసిన విషయం తెలిసిందే. రేషన్ దుకాణాల పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరులో రేషన్ దుకాణాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. బియ్యం నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, పలువురు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి, ఎన్ని కిలోల బియ్యం ఇచ్చారు? వాటితో పాటు ఇతర సరుకులు ఏమైనా ఇచ్చారా? అనే విషయాలపై ఆరా తీశారు.
సరైన తూకాలతో వాటిని పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. ప్రతినెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు రోజు ఉదయం 8 నుంచి 12, సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 8 గంటల వరకు నిత్యావసరాలను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా చౌక ధాన్యపు డిపోల ద్వారా నిత్యవసరాలను సమర్థంగా పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే చిట్టెమ్మ అనే లబ్ధిదారు ఇంటిలో చౌక బియ్యంతో వండిన భోజనాన్ని తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీలో రేషన్ దుకాణాలు వచ్చేశాయ్ - సంతోషం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు!
రేషన్ లబ్ధిదారు ఇంటిలో భోజనం - కలెక్టర్‌పై వెల్లువెత్తుతున్న ప్రశంసలు