Designing Coffee Table Book in Anantapur Dist : సంస్కృతి, వారసత్వ సంపద, పర్యాటక ప్రదేశాలు, వనరులను తెలియచేస్తూ అధికారులు కాఫీ టేబుల్ బుక్ తయారుచేశారు. తక్కువ సమయంలో అనంతపురం జిల్లా స్వరూపాన్ని అర్థం చేసుకునేలా వివరాలను పొందుపరిచారు. అధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలను చెబుతూనే జిల్లా ఆర్థిక, సామాజిక అంశాలతో పాటు మౌలిక వసతులు, అభివృద్ధిపై ఇందులో వివరించారు.
అనంతపురం జిల్లాకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించడంతో పాటు ఆసక్తిని పెంచాలనే లక్ష్యంతో తీర్చిదిద్దారు. వివిధ ప్రాంతాల విశిష్టతను తెలిపే ఫొటోలను పుస్తకంలో పెట్టారు. జిల్లా పర్యాటకశాఖ ద్వారా ఈ పుస్తకాన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయించేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని పెన్నహోబిలం, బుగ్గరామలింగేశ్వర స్వామి, చింతల వెంకటేశ్వరస్వామి తదితర పుణ్యక్షేత్రాలు, రాయదుర్గం, గుత్తి, కుందుర్పి కోటల విశేషాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. యాడికి, పంపనూరు, బూదగవి ప్రాంతాల్లో ఆదిమానవుల ఆనవాళ్ల చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. జైన సంస్కృతిని ప్రతిబింబించే జంబూద్వీపం, నగరంలోని టవర్ క్లాక్, పురావస్తుశాఖ మ్యూజియం వివరాలను పొందుపరిచారు.
అవకాశాలను వివరిస్తూ : జిల్లాలోని భారీ పరిశ్రమలు, వాటి ఉత్పత్తి సామర్థ్యం వివరాలను సంక్షిప్తంగా ఇచ్చారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో సాధించిన ప్రగతిని వివరించారు. ఉద్యాన పంటల సాగులో రైతులు సాధించిన విజయాలు, భవిష్యత్‌లో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఉన్న అవకాశాలను పుస్తకంలో పొందుపరిచారు. పర్యాటకులను ఆకర్షించడంతో పాటు జిల్లాలో పెట్టుబడులు పెట్టేవారికి ఆసక్తి కలిగించేలా కాఫీ టేబుల్ పుస్తకాన్ని రూపొందించినట్లు అనంతపురం కలెక్టర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
పట్టణాల్లో పేదరిక నివారణకు కృషి - 'మెప్మాకు' 9 స్కోచ్ అవార్డులు
ఉత్తరాంధ్రకు కొత్త ఊపు - మూడున్నర లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు!