CODING LESSONS IN AP GOVT SCHOOLS: కోడింగ్‌పై పట్టు ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులకే సాఫ్ట్‌వేర్ జాబ్‌లు వస్తుంటాయి. ఇలాంటి స్కిల్స్‌ను స్కూల్ స్థాయిలోనే ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో నిరుపేద విద్యార్థులకు కంప్యూటర్ స్కిల్స్‌ను నేర్పిస్తూ మెరికల్లా తీర్చిదిద్దుతోంది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ పేరిట ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తోంది. ఈ మేరకు గతేడాది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సమగ్రశిక్ష, లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ, క్వస్ట్ అలయన్స్ అనే స్వచ్ఛంద సంస్థలతో MOU కుదుర్చుకుంది.
పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ట్రైనింగ్ మొదలుపెట్టింది. 248 మందికిపైగా ఉపాధ్యాయులు, 7,381 మంది విద్యార్థులకు కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో నేర్పించింది. తొలి ఏడాది ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో ప్రతిభావంతులను గుర్తించి వారి స్కిల్స్‌ను మదించేలా విశాఖలో హ్యాకథాన్‌ను నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రభుత్వ స్కూల్ పిల్లలకు స్టార్ హోటల్‌లో బస ఏర్పాటుచేశారు. విజేతలకు ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు, టీవీలను బహుమతులుగా ఇచ్చారు.
స్వచ్ఛందంగా వచ్చిన వారికే ట్రైనింగ్:
కంప్యూటర్, కోడింగ్ స్కిల్స్‌ను అందిపుచ్చుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకువచ్చిన ఉపాధ్యాయులకు 6 నెలలపాటు ఫిర్కీ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం వేదికగా కంప్యూటర్ స్కిల్స్ నేర్పించారు. వీరు ఓవైపు నేర్చుకుంటూనే, మరోవైపు తరగతి గదిలో విద్యార్థులకు వాటిని పరిచయం చేశారు. కోడింగ్ అంటే ఏదో సాంకేతిక భాష, మిగతా పాఠ్యాంశాలతో సంబంధం ఉండదని అనుకున్నాం, కానీ కోర్సు నేర్చుకున్నాక తెలుగు నుంచి సాంఘికశాస్త్రం వరకు కోడింగ్ సాయంతో సులువుగా పిల్లలకు క్లాసులు చెప్పొచ్చని అర్థమైందని అని విశాఖ మాధవధార మున్సిపల్ హైస్కూల్ భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు జానకీరామ్ తెలిపారు.
అదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్న చైతన్య స్క్రాచ్ అనే కోడింగ్ ప్లాట్‌ఫాంతో ఆరోగ్య, అనారోగ్య సమస్యల కారణాలను విశ్లేషిస్తూ ఓ ఆన్‌లైన్ గేమ్‌నే రూపొందించాడు. కోడింగ్ ఉపయోగించి ఈవ్‌టీజింగ్ సమస్యను యానిమేషన్ రూపంలో విశాఖలోని తోటగరువు జడ్పీ స్కూల్ విద్యార్థినులు రూపొందించారు. పాఠాలతోపాటు కంప్యూటర్ స్కిల్స్‌ను నేర్పడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందని, నిజ జీవితంలో సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేలా ఎదుగుతారని విజయనగరం జిల్లా కొత్తవలస స్కూల్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బాపునాయుడు అన్నారు. వచ్చే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 5000 మంది ఉపాధ్యాయులు, 50 వేల మంది విద్యార్థులకు ఏఐ, కోడింగ్ స్కిల్స్‌ను నేర్పించాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నామని అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ రాష్ట్ర సమన్వయకర్త మాధవీలత చెప్పారు.
మంత్రి నారా లోకేశ్ చొరవ - ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించిన దివ్యాంగ విద్యార్థి
7 సెకన్లలో గుండె జబ్బుల నిర్థారణ - 14 ఏళ్ల ఎన్నారై సిద్దార్ధ్‌కు సీఎం అభినందనలు