Singareni CMD Balaram concern About Coal Price : సింగరేణి ప్రస్తుత బొగ్గు ధర దేశంలో ఇతర బొగ్గు కంపెనీలతో పోల్చితే చాలా ఎక్కువగా ఉందని సీఎండీ బలరామ్ ఆందోళన వ్యక్తంచేశారు. వినియోగదారులు తక్కువ ధరకు లభించే బొగ్గు వైపు మొగ్గు చూపుతున్నారని, ఇది చాలా ప్రమాదకరం అన్నారు. కనీసం టన్నుకు రూ. వెయ్యి తగ్గించే విధంగా సింగరేణి ఉత్పాదకతను పెంచాలని, ఉత్పత్తి వ్యయం తగ్గించాలని, ఇందుకు యువ అధికారులు కృషి చేయాలని సీఎండీ పిలుపునిచ్చారు.
పాత గనులు కొన్ని మూతబడుతున్న నేపథ్యంలో, ఒడిశాలోని నైనీ బ్లాకు, కొత్తగూడెంలో వీకేఓసీ, ఇల్లందులో జేకేఓసీ, బెల్లంపల్లిలో గోలేటి ఓసీల నుంచి ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నామని, తద్వారా 20 మిలియన్ టన్నుల అదనపు ఉత్పత్తి సాధించగలమని సీఎండీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది సింగరేణి నిర్దేశించుకున్న 76 మిలియన్ టన్నుల లక్ష్యాలు సాధించే అవకాశం ఉందన్నారు.
భవిష్యత్తులో మనుగడ : ఇతర రాష్ట్రాలలో కూడా బొగ్గు బ్లాకులు చేపట్టడానికి సింగరేణి సంస్థ ముమ్మరంగా ప్రయత్నిస్తోందని సీఎండీ బలరామ్ పేర్కొన్నారు. రానున్న కాలంలో సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తి పైనే ఆధారపడి మనుగడ సాధించలేదని స్పష్టం చేశారు. పర్యావరణ ఆంక్షలు, బొగ్గు నిల్వల తరుగుదల వల్ల మరో 20 ఏళ్లలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుందని, తద్వారా బొగ్గు ఉత్పత్తి కూడా తగ్గుతుందన్నారు.
ఖనిజాల ఉత్పత్తి : సింగరేణి సంస్థ కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించిందని, కేంద్ర ప్రభుత్వం కూడా కీలక ఖనిజాల ఉత్పత్తిదారులకు సంపూర్ణ ప్రోత్సాహం ఇస్తున్నందువల్ల ఈ రంగంలో సింగరేణికి మంచి అవకాశాలు ఉండబోతున్నాయని పేర్కొన్నారు. ఇతర ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి కూడా సింగరేణి అడుగుపెడుతోందని, దీనికోసం మూడు ఏజెన్సీలను కూడా నియమించుకున్నట్లు బలరామ్ తెలిపారు.
జాయింట్ వెంచర్ : అవసరమైతే ఇతర కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్‌గా కూడా ఈ రంగాల్లో ముందుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సింగరేణి ఓవర్ బర్డెన్ నుంచి ఇసుక తయారీ యూనిట్లను ఏర్పాటు చేసిందని, అలాగే ఫ్లై యాష్ నుంచి, కార్బన్‌డైయాక్సైడ్ నుంచి ఇతర ఉత్పత్తులు సాధించడానికి రంగం సిద్ధమైందన్నారు. దీనికి ముందస్తుగా సింగరేణి ప్రాంతంలో జియో కెమికల్ లేబరేటరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
అత్యధికంగా ఉత్పత్తి చేసే సంస్థగా : రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వారు 20వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుందని, దీనిలో సింగరేణి కనీసం నాలుగు నుంచి ఐదువేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి పూనుకోవాల్సి ఉందని సీఎండీ బలరామ్ అన్నారు. ప్రస్తుత 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పాదనను 800 మెగావాట్ల కొత్త ప్లాంట్ ఏర్పాటు ద్వారా 2000 మెగావాట్లకు పెంచుతున్నామని, ఒడిశాలో మరో 1600 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రంలో అత్యధిక థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సంస్థగా సింగరేణి నిలవనుందని స్ఫష్టం చేశారు.
సింగరేణి నిర్వహణలో పెరుగుతున్న మహిళల పాత్ర - కీలక విభాగాలకు అధిపతులు వీళ్లే
YUVA : ఈ మహిళ సింగరేణి బొగ్గుగనుల్లో తొలి రెస్క్యూ ట్రైన్ పర్సన్