మూసీ పునరుజ్జీవమే వరదకు పరిష్కారం - వందేళ్ల భవిష్యత్ అవసరాలకు ప్రణాళికలు
హైదరాబాద్‌లో వరద నిర్వహణపై సీఎం రేవంత్ సమీక్ష - నగరంలోని చెరువులు, నాలాలు, కుంటలు మూసీతో అనుసంధానం - నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా ప్రత్యేక ప్రణాళిక

Published : August 9, 2025 at 7:47 AM IST
Hyderabad Flood Solution : హైదరాబాద్‌లో భారీవర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించటం సహా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని స్పష్టంచేశారు. వర్షాలతో నగరం అతలాకుతలమై జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే అత్యవసరంగా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
గురువారం రాత్రి హైదరాబాద్‌లో కురిసిన వర్షం, తలెత్తిన ఇబ్బంది, అధిగమించేందుకు అనుసరించాల్సిన చర్యలపై సీఎం అత్యవసర సమావేశం నిర్వహించారు. గురువారం రాత్రి నగరంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తేందుకు గల కారణాలపై సీఎం ఆరా తీశారు. తక్కువ వ్యవధిలో భారీ వర్షం పడినప్పుడు జనజీవనం అస్తవ్యస్తమవుతోందని అధికారులు తెలిపారు. గురువారం రాత్రి కేవలం 4 గంటల వ్యవధిలోనే కొన్నిచోట్ల 15 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, జూన్ నుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో సాధారణంతో పోలిస్తే 16 శాతం వర్షపాతంఎక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కుండపోత వర్షం కురినప్పుడు అందుకు తగినట్లుగా అన్ని వ్యవస్థలను ఆధునీకరించాల్సిన అవసరముందని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రోడ్లు, డ్రైనేజీలు 5 సెంటీమీటర్ల వర్షాన్ని కూడా తట్టుకునే పరిస్థితిలేదని, ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతున్నందున అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని రేవంత్ ఆదేశించారు. ఎంతవర్షం పడినా గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా, వరద నీటితో ముంపుకు గురికాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేలా పకడ్బందీ విధానం అమలు చేయాలన్నారు.
అందుకోసం రూపొందిస్తున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించటం ద్వారా పరివాహక ప్రాంతంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు, కాలనీలు సురక్షితంగా ఉంటాయని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురి కావని సీఎం తెలిపారు.
అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీలోకి : ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లో అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మీర్ అలం ట్యాంకు సహా ప్రతీ చెరువు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానించాలని ముఖ్యమంత్రి సూచించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల వెడల్పు ప్రక్రియని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసి మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఉండేలా అభివృద్ధి పనులు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు.
ట్రాఫిక్ సమస్యకు ప్రత్యేక ప్రణాళిక : శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలు, ఇతర అవసరాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వరదనీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేయాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని స్పష్టంచేశారు. పాతనగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పాదచారుల జోన్ ఏర్పాటుచేసి పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు. చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్‌జోన్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని.... రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
వాహనాలు వెళ్తుండగానే కూలిన బ్రిడ్జి - తృటిలో తప్పిన పెను ప్రమాదం
వరదల నియంత్రణకు బృహత్తర ప్రణాళిక - ఓఆర్‌ఆర్ వరకు నీటి వనరుల జియో ట్యాగింగ్

