CM Revanth Reddy to Launch Development Works : గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని, మూసీ ఒడ్డున పేదలకు రూ.1000 కోట్లయినా ఖర్చు చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఈ మూసీ నది ప్రక్షాళనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో రూ.1500 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, ఆ తర్వాత నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చారని, గత ఎన్నికలో మళ్లీ తమ ప్రభుత్వం వస్తే తిరిగి యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చుతామన్నారు. భక్తుల కోరికలు తీర్చుకునే విధంగా మళ్లీ మారుస్తామని, భక్తులు నిద్రించే విధంగా యాదాద్రికి ఆటోలు వెళ్లేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 60 కిలోల బంగారంతో గోపురం నిర్మాణానికి నిర్ణయం తీసుకుని పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. టీటీడీ బోర్డు మాదిరిగా తెలంగాణలోనూ వైటీడీ ఏర్పాటు చేశామని హర్షం వ్యక్తం చేశారు. త్వరలో యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
అలాగే స్థానిక విద్యాసంస్థలను వర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని, మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ రైతులను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సబర్మతి, గంగా నదులు మాత్రం ప్రక్షాళన చేసుకోవచ్చన్నారు. మూసీ నదిని మాత్రం ప్రక్షాళన చేయవద్దానని ప్రశ్నించారు. నల్గొండ రైతులకు మేలు కలిగేలా మూసీ ప్రక్షాళన చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.
"పేదలను తప్పుదోవ పట్టించి ప్రభుత్వంపై బురద జల్లే యత్నం చేస్తున్నారు. రూ.20 లక్షల కోట్లు జేబుల్లో ఉంటే రూ.2 వేల కోట్లతో ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదు? పదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, యాదగిరిగుట్ట వద్ద జరిగిన అపచారానికి మూల్యం చెల్లించుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాడే, పాపాలు చేశారు కావునే మీ పరిస్థితి ఇలా మారింది. మా పార్టీలో దెయ్యాలు చేరాయని ఆ పార్టీ నాయకురాలే అన్నారు. అది బీఆర్ఎస్ కాదు, డీఆర్ఎస్ దెయ్యాల రాజ్యసమితి. కొరివి దెయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమికొట్టాలి." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
రూ.1500 కోట్ల పనులకు శంకుస్థాపన : ఆలేరు నియోజకవర్గంలో మొత్తం రూ.1500 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.575 కోట్లతో గంధమల్ల జలాశయానికి(1.41 టీఎంసీలు) శంకుస్థాపన చేయగా, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.183 కోట్లతో యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాల, రూ.22.75 కోట్లతో దాతర్పల్లిలో వేర్హౌస్కు, రూ.13.50 కోట్లతో కొలనుపాక, కాల్వపల్లి హైలెవల్ వంతెనలకు శంకుస్థాపన చేశారు. అలాగే మోటకొండూరులో ఎంపీపీ, తహసీల్దార్, పీఎస్ భవన నిర్మాణానికి, ఎంఆర్ఆర్, సీఆర్ఆర్ నిధులు కింద బీటీ రోడ్లు నిర్మాణానికి, రూ.2.75 కోట్లతో ఆలేరు మార్కెట్ యార్డు గోదాం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ : సీఎం రేవంత్ రెడ్డి
'రాష్ట్రంలో అత్యాధునిక గోశాలల ఏర్పాటు - ప్రణాళికలు సిద్ధం చేయండి : సీఎం రేవంత్ ఆదేశం