CM Revanth Reddy speech At Dattatreya Book Release Event : పదవి ఉన్నా లేకున్నా బండారు దత్తాత్రేయపై ఉన్న గౌరవం ఏ మాత్రం తగ్గదని, పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ను గౌరవిస్తారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగిన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ ‘ప్రజలకథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు చూసినప్పటికీ దత్తాత్రేయ ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు.
గౌలిగూడ టు గవర్నర్ వరకు : గౌలిగూడ గల్లి నుంచి హరియాణా గవర్నర్ వరకు ఎదిగారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సాధారణ ప్రజలతో ఆయనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. పేదలు చేసుకునే చిన్న చిన్న వేడుకల్లో ఆయన భాగం అయ్యేవారని గుర్తుచేశారు. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కుటుంబాలతో తనకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని వివరించారు. 'నా స్కూల్ చదువు బీజేపీలో, కాలేజీ చదువు టీడీపీలో ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నా అని ఇటీవల ప్రధానికి చెప్పాను' అని రేవంత్ వివరించారు. తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఎప్పుడు దాచుకోలేదన్నారు. మంత్రివర్గ విస్తరణ ఉన్నప్పటికీ ఆ కార్యక్రమం అవ్వగానే దత్తాత్రేయ కోసం ఇక్కడికి వచ్చాననన్నారు. ఆయన అజాత శత్రువు అని కొనియాడారు.
మా నిర్ణయాల్లో వారి స్ఫూర్తి ఉంది : జాతీయ రాజకీయాల్లో వాజ్‌పేయీకి ఉన్న గౌరవం రాష్ట్రస్థాయిలో దత్తాత్రేయకు ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని అభివర్ణించారు. ఆయన శైలి, విధానాల నుంచి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారు నేర్చుకోవాలని సూచించారు. జంటనగరాల్లో కష్టం వస్తే ప్రజలకు గుర్తుకు వచ్చే నాయకులు పీజేఆర్, దత్తాత్రేయ అని రేవంత్ రెడ్డి అన్నారు. తిరుపతి దర్శనాలు, రైల్వే రిజర్వేషన్ కోసం తమకు సిఫార్సు లేఖలు ఇచ్చేవారన్నారు. తమ నిర్ణయాల్లో వారి స్ఫూర్తి ఉంటుందని అన్నారు.
మంత్రివర్గ సమావేశం ఇక్కడే పెట్టుకోవచ్చు : పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. దీంతో కార్యక్రమానికి హాజరైన అతిథులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఛలోక్తి విసిరారు. ఈ వేదిక గవర్నర్‌ల పరేడ్‌లా ఉందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఈ వేదికపైనే ఉందని, తాను మంత్రివర్గ సమావేశం ఇక్కడే పెట్టుకోవచ్చని సీఎం సరదాగా వ్యాఖ్యానించారు.
ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ : సీఎం రేవంత్ రెడ్డి
సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉంది: సీఎం రేవంత్ రెడ్డి