Artificial Intelligence Data Center Cluster in Hyderabad : జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులను సాధించింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్‌టీటీ డేటా, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫాం సంస్థ నెయిసా నెట్ వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు రూ.10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందం (ఎమ్‌ఓయూ) కుదుర్చుకున్నాయి.

టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎన్‌టీటీ డేటా, నెయిసా నెట్‌వర్క్స్ నుంచి బోర్డు సభ్యుడు కెన్ కట్సుయామా, డైరెక్టర్ తడావోకి నిషిమురా, ఎన్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ బజ్‌పాయ్, నెయిసా సీఈవో, ఎన్టీటీ గ్లోబల్ డేటా ఛైర్మన్ శరద్ సంఘీ ఈ ఒప్పందంలో పాల్గొన్నారు.

డేటా సెంటర్ హబ్‌గా బలపడుతున్నాం : భారీ పెట్టుబడుల ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిలో విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఎడబ్ల్యూఎస్, ఎస్‌టీటీ, టిల్‌మన్ హోల్డింగ్స్, సీటీఆర్‌ఎల్‌ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో ఎన్‌టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్‌గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని అన్నారు.

దేశంలో అతిపెద్ద ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయం : హైదరాబాద్‌లో నిర్మించబోయే ఈ సదుపాయం 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్, 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది. దేశంలో తెలంగాణను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. ఎన్‌టీటీ డేటా, నెయిసా కంపెనీలు సంయుక్తంగా ఏఐ-ఫస్ట్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు ఈ క్లస్టర్ కొత్త ఆవిష్కరణల కేంద్రంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు ఇది దోహదం చేస్తుంది.

మరోవైపు టోక్యోలో నిర్వహించిన ఇండియా - జపాన్ భాగస్వామ్య రోడ్‌షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జపాన్‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం సమావేశం అయింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుకూలతలను వివరించారు. లైఫ్ సైన్సెస్, జీసీసీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఏఐ డేటా సెంటర్లు, ఈవీ, టెక్స్‌టైల్స్, లాజిస్టిక్స్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం ప్రచార వీడియోలను రేవంత్ రెడ్డి బృందం ప్రదర్శించింది. భారత్, జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్ నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
మరో పరిశ్రమ ఏర్పాటు : మరోవైపు వికారాబాద్ జిల్లా రుద్రారంలో రూ.562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలోనే తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు ఈ ఒప్పందం జరిగింది. రుద్రారంలో ఇప్పటికే ఈ సంస్థ రెండు ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది.
''మెట్రో' కోసం రూ.11,693 కోట్ల రుణం ఇవ్వండి' : జైకాను కోరిన సీఎం
తొలి రోజే రూ.1000 కోట్ల ఒప్పందం - తెలంగాణలో పెట్టుబడులకు జపాన్ కంపెనీ ఓకే!